Harish Rao: కోడికత్తి రాజకీయాలు అనడం దారుణం! ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మంత్రి హరీష్ రావు పరామర్శ
Harish Rao visits MP Kotha Prabhakar Reddy: కడుపులో చిన్న పేగు నాలుగు చోట్ల రంధ్రాలు పడితే, వైద్యులు తొలగిస్తే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా అని హరీష్ రావు సీరియస్ అయ్యారు.
దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కత్తి దాడికి గురైన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కత్తిదాడితో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి హరీష్ రావు యశోదా హాస్పిటల్ కు వెళ్లి బీఆర్ఎస్ ఎంపీని పరామర్శించారు. ఆరోగ్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిన పరామర్శించిన అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కొంత నిలకడగా ఉందన్నారు. యశోద వైద్యులు నిరంతరం ఆరోగ్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల సీనియర్ నాయకులు కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగితే చూసి కూడా కోడికత్తి అని రాజకీయాలు అపహాస్యం చేయడం సరికాదన్నారు. మా నేతలపై దాడులు చేయించుకోవాల్సిన అవసరంగానీ, లేని విషయాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదన్నారు.
కడుపులో చిన్న పేగు నాలుగు చోట్ల రంధ్రాలు పడితే, వైద్యులు తొలగిస్తే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా అని హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఓ నేతపై దాడి జరిగితే బాధ్యతాయుతంగా ఖండించాల్సిన ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి. దిగజారిపోయి మాట్లాడటం సరికాదన్నారు. 15 సెంటి మీటర్లు ఓపెన్ చేసి, సర్జరీ చేసి పేగు కట్ చేసి తొలగించారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదివరకే కాల్ డేటా సేకరించారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
కుట్ర కోణం ఒకట్రెండు రోజుల్లో ఛేదిస్తారు!
తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ఇలాంటి హత్యా రాజకీయాలను రాయలసీమ, బిహార్ లో చూశామన్నారు హరీష్ రావు. పోలీసులు ఒకటి రెండు రోజుల్లో కుట్ర కోణం చేధిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు జరగలేదని, వ్యక్తులపై కేసులు పెట్టే ప్రయత్నం తాము చేయలేదన్నారు.
పనితనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని, నిజంగానే ఆయనకు పగ ఉంటే ఇప్పటికీ ఎంతో మంది జైళ్లలో ఉండేవారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు హౌసింగ్ స్కాంలో వందల కోట్లు మెక్కారు. అందరినీ లోపల వేసేవాళ్ళం. ఓటుకు నోటు కేసు ఉంది. కానీ ఏనాడు మేము ఇలాంటి పనులకు పాల్పడలేదు. రాజకీయాలలో ఇలాంటివి జరగటం దురదృష్టకరం అన్నారు. ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని, తమకు న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉందన్నారు.
Also Read: బీఆర్ఎస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి - పార్టీ బలం పెరిగిందన్న సీఎం కేసీఆర్
ఎంపీపై కత్తి దాడిని వ్యతిరేకిస్తూ నేడు దుబ్బాక బంద్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఖండించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు.