Minister Indrakaran Reddy: బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు
Minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా బాసర సరస్వతీ దేవిని దర్శించుకున్నారు. మూల నక్షత్రం పర్వదినం సదంర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
![Minister Indrakaran Reddy: బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు Telangana Minister Allola Indrakaran Reddy Visited Basara Saraswathi Temple Minister Indrakaran Reddy: బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/57f69bc5d07b626e6101f17af68a32ca1664697457305519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Indrakaran Reddy: బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు సరస్వతీ దేవిగా నిజ రూప దర్శనమిస్తుండటంతో బాసరలో భక్తుల తాకిడి పెరుగుతోంది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీకి సరిపడా వసతులు లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.
దేవస్థానం వసతి గృహాలు, కాటేజీలతో పాటు ప్రైవేటు సత్రాలు కూడా నిండి పోయాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సరస్వతీ, లక్ష్మీ, మహంకాళి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎర్పాట్లను ఆలయ కమిటీ నిర్వహించినప్పటికీ.. మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. దీంతో బాసర భక్తులతో రద్దీగా మారింది.
నిన్న జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి..
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం రోజు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. దసరా నవరాత్రుల సందర్భంగా మహా శక్తి పీఠాలలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు . కృష్ణా పుష్కరాలను సొంత రాష్ట్రంలోని జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు.
మొన్న బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి..
దసరా శరన్నవరాత్రి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారిని రాష్ట్ర దేవయ్య మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అంతకు ముందు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నవరాత్రుల ఐదవ రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. అదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతుకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని గణేష్ ఆలయాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)