(Source: ECI/ABP News/ABP Majha)
Minister Mallareddy: ఐటీ అధికారి రత్నాకర్ ను అరెస్టు చేయొద్దు, మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల కేసులో హైకోర్టు ఆదేశాలు
Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
Minister Mallareddy: ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాల సందర్భంగా ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోదాలు జరుగుతున్న క్రమంలో బుధవారం రాత్రి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ తో కలిసి బోయిన్ పల్లి ఠాణాకు వచ్చారు. ఆదాయ పన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని... అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని, సెర్చ్ ప్రొసీడింగ్స్ పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
తనపై ఆక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది. నాలుగు వారాల పాటు రత్నాకర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం... కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.
మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ల్యాప్ టాప్ పై గందరగోళం కొనసాగుతోంది. ఐటీ అధికారి రత్నకుమార్ ల్యాప్ టాప్ చోరీ అయిందని అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని.. మంత్రి మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ల్యాప్ టాప్ ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని... ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ల్యాప్ టాప్ తీసుకు వెళ్లలేదు. ల్యాప్ టాప్ లో కీలక సమాచారం ఉందని ఐటీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ల్యాప్ టాప్ బోయిన్ పల్లి పోలీసుల వద్దనే ఉంది.
65 బృందాలు సోదాలు..
మూడు రోజులుగా జరిగిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.
భారీగా నగదు స్వాధీనం..
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఐటీ సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారులు ఈ విషయం మీద స్పందిస్తూ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నాటికి సోదాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.