Highcourt On G.Os : జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం !
జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 24 గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వచ్చిన ఇబ్బందేమిటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 24 గంటల్లోగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ఈ నెల నాలుగో తేదీన దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించారు. తర్వాతి రోజు అంటే ఆగస్టు 5వ తేదీన నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దళిత బంధు పథకానికి అవసరమైన నిబంధనలు ఖరారు చేశామని రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిబంధనలు ఖరారు చేసిన విషయానని పిటిషన్‌లో ఎందురు పేర్కొనలేదని పిటిషనర్ అయిన వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ లాయర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని... జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇరవై నాలుగు గంటల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారని ఆదేశించింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణను నమోదు చేసుకుని పిటిషన్‌పై విచారణ ముగించింది. తెలంగాణ సర్కార్ మరో రోజులో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాల జీవోను వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేస్తోందని గతంలో కూడా పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. చాలా రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో దాదాపుగా 40శాతం దాచి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఏపీలోనూ చర్చనీయాంశం అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం రెండు రోజుల కింట అసలు ఏ ఒక్క జీవోనూ ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని నిర్ణయం తీసుకుంది. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టడం నిలిపివేసింది. జీవోల కోసం రిజిస్టర్లను నిర్వహించాలని అన్ని శాఖలకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగానే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు అక్కడ కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.