Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Caste Census survey In Telangana | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో కమ్మరి, కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana High court gives over Vishwa Brahmin or Vishwakarma in Caste Census survey | హైదరాబాద్: విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వేలో తమ కుల ప్రస్తావన లేదని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. కంచరి, కమ్మరి, కంసాలి, వడ్ల, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఆ ఐదు కుల వృత్తుల వారి కులంపై హైకోర్టు తీర్పు
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వే చేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టు శనివారం స్పష్టత నిచ్చింది. బీసీ కులాల (BC Caste)ను వర్గీకరించిన జీ.ఓ.లో పేర్కొన్న వృత్తులైన కమ్మరి, కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా ఉన్నాయని కోర్టు స్పష్టత ఇచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలోని ఫారాలలో వీరిని వృత్తుల ప్రకారం వేరే కులాలుగా నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలలో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, విశ్వ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ కమీషన్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి పలు విజ్ఞప్తులు అందచేశాయి. అయినా ఫారాలలో సరి చేయకుండా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగించడాన్ని విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోషియేషన్ కు చెందిన సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వృత్తి పరంగా కాకుండా కమ్మరి, కంసాలి, వడ్ల, కంచరి, శిల్పిలను విశ్వ బ్రాహ్మణులుగా ఒకే కోడ్ గా పరిగణించాలని కోరారు. హైకోర్ట్ ( 11 కోర్టు ) జస్టిస్ సూరేపల్లి నందా పరిగణనలోకి తీసుకొని, ఆ వృత్తుల వారిని వేరే కులాలుగా కాకుండా విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలని శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విశ్వబ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే 20 జిల్లాల్లో పూర్తయిందని ఇటీవల తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సైతం 93 శాతం మేర సమగ్ర కుల గణన సర్వే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. అన్ని కులాలు, సామాజిక వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సర్వే చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సందర్భాలలో తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కుల గణన సర్వే పూర్తి చేస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులపాటు ఒంటి పూట బడులు పెట్టి.. టీచర్లతో సమగ్ర సర్వే చేపించారు. మధ్యాహ్నం వరకు స్కూళ్లలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు, మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటింటికి వెళ్లి ఫారాలలోని ప్రశ్నలు అడిగి సర్వే చేశారు.