Telangana News: సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Congress Govt in Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితి రాకుండా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి తమ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలు అందలేదని ఫలితంగా పేదలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితి రాకుండా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ధరణిని తీసుకొచ్చి భూములు కొల్లగొట్టిన బీఆర్ఎస్!
భూముల డిజిటలైజేషన్ పేరుతో ధరణిని తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ధరణిపై ఒక కమిటీని నియమించామని, ఆ కమిటీ తమ నివేదికను త్వరలో అందిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశాము. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించాలన్న ఆలోచన చేస్తున్నామని ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని తెలిపారు. ఈ కమిటీలో ప్రిన్సిపాల్ సెక్రటరీ, రెవెన్యూ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్, సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్), డిస్టిక్ కలెక్టర్, రంగారెడ్డి, సెక్రటరీ, సీసీఎల్‌ఎ, నెంబర్ కన్వీనర్‌గా ఉంటారని ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశామని తెలిపారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికను అందిస్తుందన్నారు.
ధరణి పేరుతో తమ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. రెవెన్యూ సేవలను ప్రజలకు ఉపయోగపడేలా సంస్కరణలను తీసుకొస్తున్నామని.. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందించడానికి తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.
వీఆర్ఏల అంశంపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ..
వీఆర్ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా.. సీసీఎన్ఏ కార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉంటారు. వీఆర్ఎల అంశంపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఎ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్ట పరిమితి, న్యాయ వివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.