Telangana Budget: గవర్నర్ Vs ప్రభుత్వం: బడ్జెట్‌కు ఆమోదం తెలపని తమిళిసై - నేడు కోర్టుకు ప్రభుత్వం
డ్రాఫ్ట్ బడ్జెట్ కాపీలను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో ప్రభుత్వం - గవర్నర్ మధ్య విభేదాలు మరో స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ 2023 - 24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. మరో నాలుగు రోజులే అందుకు గడువు ఉండగా ఇంతవరకూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బడ్జెట్‌కు అమోదం తెలపలేదు. దీంతో అధికార వర్గాల్లోనే కాక, నేతల్లోనూ ఆందోళన నెలకొంది.
డ్రాఫ్ట్ బడ్జెట్ కాపీలను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పంపిన బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతే దాన్ని కేబినెట్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్‌ను శాసనసభ, శాసన మండలిలో ఒకే సమయంలో వేర్వేరుగా ప్రవేశపెడతారు.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీని ప్రభుత్వం ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత బడ్జెట్ సిఫారసుకు అనుమతి కోరుతూ గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ విధిగా సిఫారసు కచ్చితంగా చేయాల్సిందేనని ప్రభుత్వం అంటోంది. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఇందుకు సంబంధించి సంప్రదింపులు చేశారు.
నేడు హైకోర్టుకు ప్రభుత్వం
గవర్నర్ బడ్జెట్‌ను ఆమోదించడం లేదని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించనుంది. సోమవారం (జనవరి 30) రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే
ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాలకు ఇవి కొనసాగింపుగానే ఈసారి కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపర్చనున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదు. పోయిన సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో కూడా గవర్నర్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన సంగతి తెలిసిందే.