(Source: ECI/ABP News/ABP Majha)
Telangana New High Court: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు - స్థలం కేటాయిస్తూ జీవో జారీ
Telangana High Court: తెలంగాణ నూతన హైకోర్టు భవనానికి 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది.
Telangana Government GO on Land Allotment for New High Court: తెలంగాణలో (Telangana) కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendra Nagar) మండలం బుద్వేల్, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిశారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నూతన హైకోర్టు నిర్మాణానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకూ హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. కొత్త భవన నిర్మాణం పూర్తై.. అక్కడికి ఉన్నత న్యాయస్థానం మారిన తర్వాత పాత భవనాన్ని హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదా మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.