Harish Rao On Kaleshwaram Facts: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలోనే తేల్చుకుంటాం, చీల్చి చెండాడుతాం- హరీష్ రావు
కాళేశ్వరం అక్రమాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను జరగని అవినీతి కేసులో ఇరికించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

Kaleshwaram Facts and Evidence | హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కేబినెట్ అనుమతి లేదని, కేవలం అప్పటి సీఎం కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలతో డిజైన్, అంచనా వ్యయం, బ్యారేజీల నిర్మాణం జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, లోపాలకు కేసీఆర్, అప్పటి మంత్రులు బాధ్యులని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. పాలనను గాలికొదిలేసి, కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను హింసించాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. నచ్చిన పేరాలతో లీకులు, తమకు నచ్చని నేతలు బాధ్యులు అనే తీరుగా లీకైన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉందని ఎద్దేశా చేశారు. అసెంబ్లీలో కనుక ఇలా లీకులు కాకుండా పూర్తి 650 పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెడితే కనుక బీఆర్ఎస్ నేతలు చీల్చి చెండాడుతారంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ కమీషన్ల ప్రభుత్వం విమర్శలా.. హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు దాచిపెట్టి, ఓ నివేదిక వండి వార్చిందని హరీష్ రావు విమర్శించారు. పాలనను గాలికొదిలేసి.. హాస్టల్ పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నా, ఫీజు రీయింబర్స్ ఇవ్వకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు బంధు నిధులు జమ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్దారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదు. రాజకీయ కుట్రతో ప్రతిపక్షాల మీద విచారణ కమీషన్లు, ప్రభుత్వం పనులు చేయాలంటే కమీషన్లు అన్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ లో బిల్లులు రావాలంటే 10, 12 శాతం కమీషన్లు అడుగుతున్నారని సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద కుట్రపన్నాయని ఆరోపించారు.
గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలితే అక్కడితే ఎన్డీఎస్‌ఏ అక్కడికి పోదు, రిపోర్ట్ ఇవ్వదు. కానీ మేడిగడ్డ బ్యారేజీ మీద రాష్ట్ర ప్రభుత్వం కోరకున్నా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సమయంలో ఒక్కో రిపోర్ట్ చొప్పున ఇచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మరో రిపోర్ట్ పేరుతో మోసం చేస్తున్నారు. రాత్రికి రాత్రే పీసీ ఘోష్ కమిషన్ గడువును రేవంత్ రెడ్డి పెంచారు. మాకు నోటీసులు రాకముందే కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు అని ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ప్రభుత్వం లీక్ చేసిన రిపోర్టులో అవాస్తవాలున్నాయి. కమిషన్ చెప్పిందే చెప్పారా. లేక ప్రభుత్వమే వండి వార్చిందా అని క్లారిటీ లేదు.
650 పేజీల రిపోర్టులో కొన్ని పేజీల రిపోర్ట్ మాత్రమే ఎలా బయటకు వచ్చింది. అసెంబ్లీలో మొత్తం రిపోర్ట్ ప్రవేశపెడితే కనుక బీఆర్ఎస్ నేతలు చీల్చి చెండాడుతారు. గట్టిగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. నచ్చిన పేరాలతో లీకులు, నచ్చని నేతలను బాధ్యులు అన్నట్లుగా నిన్న లీకైన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉందన్నారు’ హరీష్ రావు.






















