Orchard Farming: ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకం - భారీగా ముందుకొస్తున్న రైతులు
Orchard Farming: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకానికి తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
Orchard Farming: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నారు. అయితే ఈ పెంపకానికి రైతులు పెద్ద ఎత్తున మందుకు వస్తున్నారు. మూడే మూడు వారాల్లో ఏకంగా 18 వేల 640 మంది రైతులు 33 వేల 697 ఎకరాల్లో పండ్ల తోటలను వేసేందుకు ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెలాఖరు వరకు పది వేల మంది స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వడగళ్ల వానలు, వాతావరణ మార్పుల్లో సమస్యల కారణంగా రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తుండగా.. రాష్ట్ర సర్కారు ఈ పథకం కిందే పండ్ల తోటలు వేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 50 వేల ఎకరాల్లో కొత్తగా పండ్ల తోటలు సాగు చేయాలని భావిస్తోంది. ఉపాధి కూలీలుగా నమోదు చేసుకున్న ఐదెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఇందులో అవకాశం కల్పించింది.
ఏఏ పంటలకు అవకాశం కల్పిస్తున్నారంటే?
ఉపాధి హామీ పథకంలో భాగంగా మామిడి, జామ, మునగ, సీతాఫలం, సపోటా, బత్తాయి, అల్లనేరేడు, ఆయిల్ పామ్ తోటలకు అవకాశం కల్పించారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కు కూడా ఛాన్స్ ఇవ్వగా... కేవలం అర ఎకరాలో మాత్రమే సాగు చేసేలా నిర్ణయించారు. అంతేకాకుండా కొబ్బరి చెట్లను కేవలం గంట్ల వెంట మాత్రమే పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పండ్ల తోటల సాగు కోసం గుంతలు తీయడానికి, మొక్కల కొనుగోలుకు, వాటిని నాటడానికి, ఊతకర్రలు కట్టడానికి, ఎరువులకు, నెల నెలా పర్యవేక్షణకు ఇలా ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఉపాధి హామీ పథకం నుంచే నిధులు ఇస్తారు. అలాగే బిందుసేద్యం సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వే కల్పిస్తుంది.
అయితే తెలంగాణ సర్కారు అలా దరఖాస్తులకు ఆహ్వానం పలికిందో లేదో అలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తుండడంతో... అధికారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా నల్గొండ జిల్లా నుంచి 2 వే 978 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతులు ముందుకు వచ్చారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 2 వేల 118 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాజిల్లాలో 2 వేల 650 ఎకరాల్లో, సిద్దిపేటలో 1,922 ఎకరాల్లో, నాగర్ కర్నూల్ జిల్లాలో 1,935 ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 1,748 ఎకరాల్లో తోటలు వేస్తామని అన్నదాతలు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో వెయ్యి 5 ఎకరాల లక్ష్యానికి గాను 14 వందల 72 ఎకరాల్లో 144 శాతం తోటలు వేసేందుకు రైతులు ముందుకు వచ్చారు. జగిత్యాలలో114 శాతం, సంగారెడ్డి 112 శాతం, వికారాబాద్ 111 శాతం లక్ష్యాలను అధిగమించాయి. సిద్దిపేటలోఇప్పటికే 98 శాతం లక్ష్యం చేరుకుంది.
దరఖాస్తు చేసుకున్న వారిలో 60 శాతం మంది మామిడి తోటలు పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత నిమ్మ, జామ, కొబ్బరిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు రెండు వేల మంది డ్రాగన్ ఫ్రూట్ వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సర్కారు ఈ నెలాఖరులోగా అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సప్టెంబర్ మొదటి వారం నుంచి రాయితీని విడుదల చేసి తోటల పెంపకాన్ని ప్రారంభిస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 14 రకాల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో అత్యధికంగా మామిడి తోటలు ఉండగా.. 2.89 లక్షల ఎకరాల్లో మామిడి, 76 వేల 315 ఎకరాల్లో దానిమ్మ, 31 వేల 843 ఎకరాల్లో నిమ్మ, 6 వేల 508 ఎకరాలోల జామ తోటలు ఉన్నాయి. అయితే ఎస్పీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇస్తుండగా.. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు.