Telangana Elections 2023: బీజేపీకి తుల ఉమ రాజీనామా - బీసీ బిడ్డనైన తనకు అన్యాయం జరిగిందని లేఖ
Tula Uma: వేములవాడ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో బీఫామ్ వేరే వారికి ఇవ్వడంతో ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Tula Uma Resigned to BJP: తెలంగాణ ఎన్నికల సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలు వేరే పార్టీలో చేరుతున్నారు. తాజాగా, వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి బీఫామ్ దక్కకపోవడంతో తుల ఉమ ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. వేములవాడ టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామ చేస్తున్నట్లు చెప్పారు. బీసీ బిడ్డనైన తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
లేఖలో ఏముందంటే.?
'బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. పార్టీకి చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు. నా గొల్ల కురుమ జాతికి జరిగిన అన్యాయం. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నారు. నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేస్తున్నారు. అసలు బీఫామ్‌లే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకు పోతామని అనడం విడ్డూరంగా ఉంది.' అని తుల ఉమ లేఖలో పేర్కొన్నారు.
ఓ టికెట్ తో అనుబంధాన్ని తెంచలేరు
ప్రజలతో తనకు ఎప్పటి నుంచి సంబంధాన్ని ఓ ఎమ్మెల్యే టికెట్‌తో తెంచలేరంటూ తుల ఉమ లేఖలో తెలిపారు. 'తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిణిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కూడా సేవ చేసే భాగ్యం లభించింది. నా ప్రజాసేవలో నేను ప్రజలకు మరింత చేరువ అవుతాను. తనను ఇంతలా అవమానించ పార్టీలో ఉండలేను.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా వెన్నంటి ఉన్న నా గొల్ల కురుమలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజలకు జీవితాంతం రణపడి ఉంటాను.' అని పేర్కొన్నారు.
చివరి నిమిషంలో
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా ముందుగా తుల ఉమను ప్రకటించి చివరి నిమిషంలో అభ్యర్థిని బీజేపీ మార్చేసింది. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ రావును వేములవాడ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇచ్చింది. దీంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో తాను కచ్చితంగా ఉంటానని.. బీజేపీ బీసీ, మహిళా నినాదం అంతా బోగస్ అని పార్టీని విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం కూడా తనకు ఇవ్వలేదని వాపోయారు. ఆమె ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.
Also Read: Telangana Elections 2023: రెండో విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ - షెడ్యూల్ ఇదే