Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
Telangana Results: మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. ప్రజల ఆసక్తికి, తాము గెలుస్తామో లేదోనన్న నేతల ఎదురుచూపులకు ఇంకొన్ని గంటల్లో తెర పడనుంది.
Telangana Elections Results 2023: మరికొన్ని గంటల్లో ఉత్కంఠ వీడనుంది. తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో.? తేలిపోనుంది. 119 స్థానాలున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాల్లో గెలిచి తీరాల్సిందే. డిసెంబర్ 3న (ఆదివారం) మధ్యాహ్నానికి ఏ పార్టీకి అనుకూలంగా ఉందో స్పష్టత రానుంది. సాయంత్రానికి నైతిక విజయాల ఆక్రందనలు, గెలిచిన నేతల సంబురాలు, ఓడిన నేతలకు ఓదార్పులు, ఎందుకిలా జరిగింది.? రాజకీయ విశ్లేషణలు అన్నీ ఆవిష్కృతం కానున్నాయి. మరి ఓటర్లు ఎవరి మేనిఫెస్టోను ఎక్కువగా నమ్మారో.? ఎవరి చేతుల్లో తమ ఐదేళ్ల భవిష్యత్తును పెట్టారో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.
ఎవరికి వారే ధీమా
ఈ క్రమంలో గెలుపుపై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని సీఎం కేసీఆర్, ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించారు. ఇదే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని, కచ్చితంగా హ్యాట్రిక్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం పదేళ్ల కుటుంబ పాలనకు అంతం పలకాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలని, ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూస్తే అసలైన అభివృద్ధి అంటే చేసి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో అమలు చేసిన గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అటు, బీజేపీ సైతం బీసీని సీఎం చేస్తామనే ప్రధాన అజెండాతో ప్రజల్లోకి వెళ్లింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామంటూ చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తామనే నమ్మకంతో కమలం పార్టీ నేతలు ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే.?
నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు పూర్తైన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు ప్రధాన సంస్థలు కాంగ్రెస్ దే అధికారం అంటూ తేల్చిచెప్పగా, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. తెలంగాణ ప్రజలు ఈసారి కచ్చితంగా అధికారం మార్పు కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపగా, ఇవి 'ఎగ్జిట్ పోల్స్' అని 'ఎగ్జాక్ట్ పోల్స్' కాదని బీఆర్ఎస్ నేతలు స్ఫష్టం చేస్తున్నారు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని, ఓ సంస్థ మాత్రమే సరైన ఫలితాలు వెల్లడించినట్లు చెప్పారు. ఈసారి కూడా మూడోసారి సీఎంగా కేసీఆర్ ఎన్నికై హ్యాట్రిక్ కొడతారని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు.
హంగ్ వస్తే.?
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లుండగా, సాధారణ మెజార్టీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కు ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది. ఆ పార్టీకి మజ్లిస్ ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్నందున 53 సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అయితే, మజ్లిస్ మద్దతిచ్చినా సరిపోనంతగా బీఆర్ఎస్ కు సీట్లు వస్తే ఆ పార్టీ జాతీయ పార్టీలో ఒకదానిని ఎంచుకునే ఛాయిస్ ఉంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ ల్లో ఎవరు బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకుంటే అతి పెద్ద సవాలేనని చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని స్థానాలు తగ్గితే, హస్తం పార్టీ ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు వెళ్తుందో.? అనేది ఆసక్తిగా మారింది. అసలు హంగ్ అనే పరిస్థితే వస్తే కాంగ్రెస్ పార్టీకే అసలు పరీక్షని చెప్పాలి. పదేళ్లుగా అధికారం దూరంగా ఉన్న పార్టీకి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని నేతలు భావిస్తున్నారు. పూర్తి మెజార్టీయే రావాలని ఆకాంక్షిస్తున్నారు.
కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 3న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండనుంది. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌పై ఓ మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు.