Telangana Elections 2023: 'ఫాం హౌజ్ లో నిద్రపోయే సీఎం మనకు అవసరమా.?' - సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్న ప్రధాని మోదీ
PM Modi: పదేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, కేంద్ర పథకాలను అడ్డుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని మండిపడ్డారు.
PM Modi Comments on CM KCR: ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) హయాంలో తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూఫ్రాన్ (Thupran), నిర్మల్ (Nirmal) లోని సకల జనుల సంకల్పం పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందని, రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని, ప్రజల భవిష్యత్ గురించి చింత లేదని ధ్వజమెత్తారు. నిర్మల్ లో బొమ్మల పరిశ్రమను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు.
'ధరణి'తో భూ మాఫియా
కేసీఆర్ ప్రభుత్వం 'ధరణి' ద్వారా భూ మాఫియాకు పాల్పడిందని ప్రధాని ఆరోపించారు. సర్కార్ స్టీరింగ్ ను కేసీఆర్ వేరే పార్టీ చేతుల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న ఆయన, ప్రజలను కలవని, ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితమయ్యే సీఎం మనకు అవసరమా.? అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ పేదల వ్యతిరేక ప్రభుత్వమని, ఇక్కడి ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతోందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఆ విషయమే ప్రస్తావించవని ధ్వజమెత్తారు. మతం పేరిట ఐటీ పార్కులు చేపడతామని కాంగ్రెస్ చెబుతోందని, ఓట్ల కోసమే ఈ పార్కులు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారని, బీజేపీ హయాంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు.
'బీజేపీతోనే సౌభాగ్య తెలంగాణ'
బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'పదేళ్లలో 4 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించాం. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే నిజామాబాద్ ను పసుపు నగరంగా ప్రకటిస్తాం. అలాగే ఆర్మూర్ పసుపు పంటకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేస్తాం. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తాం.' అని వివరించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని, బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈటలకు భయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ లో ట్రైలర్ చూశారని, ఇకపై సినిమా చూస్తారని చెప్పారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply