Telangana Elections 2023: 'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - అధికారం ఇస్తే ప్రజా పాలన చూపిస్తామన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: సీఎం కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయమని, 'ధరణి' పేరుతో రైతుల భూములు ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెెంటనే 6 హామీలు అమలు చేస్తామన్నారు.
Rahul Gandhi Slams BRS and BJP in Sangareddy: తెలంగాణలో (Telangana) పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి, అంథోల్ లో (Sangareddy) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూలో ఎదురు చూస్తున్నారని, పేపర్ల లీక్ తో వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్ కలిసి ప్రజల డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.
'దొరల, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు'
ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారెంటీలపై సంతకం పెట్టి అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అలాగే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 వేస్తాం. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం.' అని రాహుల్ వివరించారు.
'నిరుద్యోగుల బాధలు విన్నా'
శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లోని నిరుద్యోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని, రాష్ట్రంలో పేపర్ లీకేజీ వల్ల వారు ఎంతో నష్టపోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే, అవి రద్దవడంతో వారి బాధలు వర్ణనాతీతమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని బీఆర్ఎస్ అంటోందని, 'కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. మీరు ఏ స్కూల్ చదివారో ఆ స్కూల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ.' అని పేర్కొన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును రికవరీ చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఆ నగదును పేదల అకౌంట్ లో వేస్తామని అన్నారు.
'ఆ మూడు పార్టీలు ఒక్కటే'
రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒక్కటయ్యాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 'ల్యాండ్స్, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రధాని మోదీ నాపై 24 కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి నన్ను పంపించేశారు. అవినీతిపరుడైన కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా లేదు.' అని ధ్వజమెత్తారు. ప్రజలు ఆలోచించి హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply