Telangana Elections 2023: కారులో కరెన్సీ దగ్ధం - పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేలా ప్లాన్, చివరకు!
Warangal News: పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కారు బానెట్ లో నగదు తరలిస్తుండగా కాలి బూడిదైన ఘటన వరంగల్ లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Currency Notes Burnt in the Car Engine in Warangal: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ నగదు భారీగా పట్టుబడుతోంది. అయితే, పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా కారు ఇంజిన్ లో నగదు తరలించేందుకు యత్నించగా కాలి బూడిదైన ఘటన వరంగల్ (Warangal) - ఖమ్మం (Khammam) జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కారు బానెట్ కింద నగదును అక్రమంగా తరలిస్తుండగా ఇంజిన్ వేడికి రూ.లక్షలాది కరెన్సీ కాలి బూడిదైంది. వరంగల్ నుంచి వర్ధన్నపేట (Vardannapeta) వైపు వెళ్తున్న కారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు తరలిస్తున్నారు. కారు బొల్లికుంట (Bollikunta) క్రాస్ రోడ్డు వద్దకు రాగానే కారులోంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన వారు కారు, డబ్బును వదిలేసి పరారయ్యారు. అందులోని డబ్బు దగ్ధం కాగా వెనుకనే మరో కారులో వచ్చిన వ్యక్తి నోట్ల కట్టల సంచిన తన వెంట తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇందులో తరలిస్తున్న డబ్బు రూ.50 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. కాగా, రూ.15 లక్షల విలువైన కరెన్సీ కాలిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది, ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారు.?, నగదు దగ్ధమైన తర్వాత నోట్లు తీసుకెళ్లింది ఎవరు.? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, ప్రమాదానికి గురైన కారు మణిరాజు చకిలీల పేరుతో మూసారాంబాగ్ చిరునామాపై ఉందని పోలీసులు గుర్తించారు. రోడ్డుపై పడిపోయిన నోట్లను కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికే ఇంతమొత్తంలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
విలేకరి నుంచి నగదు స్వాధీనం
మరోవైపు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ పత్రికా విలేకరి నుంచి పోలీసులు రూ.44 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, తాండూరుకు చెందిన విలేకరి బైక్ పై బషీరాబాద్ నుంచి రైల్వే గేటు వైపు వస్తున్నాడు. పోలీసులు చెక్ చేయగా రూ.44,84,500 లభించాయి. ఓటర్లకు పంచడానికే ఈ డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకూ
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విడుదల చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకూ తెలంగాణలోనే అత్యధికంగా నగదు సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు వివరించింది. ఇందులో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులు ఉన్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Madiga Community: ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియలో కదలిక - కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశాలు