Harish Rao: రేపు హరీశ్ రావు నామినేషన్, అందరిలోకెల్లా ఈయన బాగా స్పెషల్! ఎలాగంటే
Harish Rao Nominations: తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేల్లోకెల్లా హరీశ్ రావు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే..
Telangana News: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) రేపు (నవంబరు 9) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేల్లో హరీశ్ రావు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. సీఎం కేసీఆర్ తర్వాత సిద్దిపేట (Siddipet News) శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి హరీశ్ రావు 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్లతో గెలిచారు. 2010 మొదట్లో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశారు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93,328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. హరీష్ రావుకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం 2021, నవంబరు 9న బాధ్యతలు చేపట్టారు. 2023 లో జరిగే ఎన్నికలకు సిద్దిపేట అభ్యర్థిగా ఆగస్టు 21న మరోసారి ప్రకటించారు. రేపు గురువారం రోజున ఉదయం 11:30 తరవాత నామినేషన్ వేయనున్నారు.
హెలిప్యాడ్ పరిశీలన
గజ్వేల్ లో ఐఓసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రేపు నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారని చెప్పారు. అనంతరం గజ్వేల్ లో నామినేషన్ తర్వాత హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారని చెప్పారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని హరీశ్ రావు వివరించారు.
ఎన్నికల ప్రచార ముగింపు సభ గజ్వేల్‌లో
ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎంతో గజ్వేల్ లో ఈ నెల 28న తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. ‘‘2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాం. కేసీఆర్ కు ఓటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం అయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్.
తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు? పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బీఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది’’ అని హరీశ్ రావు మాట్లాడారు.