Telangana Elections 2023 : కే కేటీఆర్‌కు అడ్డు అవుతాననే గెంటేశారు - కీలక విషయాలు చెప్పిన ఈటల రాజేందర్
Telangana Elections 2023 : కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ ఏమైనా చేస్తారని ఈటల రాజేందర్ అన్నారు. అడ్డు వస్తాననే తనను కేసీఆర్ గెంటేశారన్నారు.
Telangana Elections 2023 : కేటీఆర్ ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పారు. 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులో అడుగేసిన తనని అడ్డు వస్తానని బయటికి గెంటేశారని, మంత్రి హరీష్ రావును కూడా అదే గతి పట్టేదన్నారు. అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాన్ని కాబట్టి నన్ను నెట్టేసిండని ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమయ్యారని, వారు డబ్బు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని ప్రజలను కోరారు. బస్తీ ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదని, పేదలు గుడిసెలు వేసుకున్న భూములను లాక్కొని, పేద్దోళ్లకు కట్టపెడుతున్నాడని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని విమర్శించారు. కేసీఆర్‌ను కాదని ఏ మంత్రి కూడా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీలు, దళితులు, గిరిజనులను ముఖ్యమంత్రి చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని సవాలు విసిరారు.
ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రధానమంత్రి నాలుగు హామీలు చెప్పమన్నారన్నారు. కుటుంబ పెద్దకు బీజేపీ రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుందని, పేద వారికి 60 గజాల స్థలం లేదంటే డబుల్ బెడ్‌రూం, అర్హులైన వారికి తెల్లరేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీకి కోపం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ముఖ్యమంత్రి పదవి అని, ఇతరులకు అవకాశం రాదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అగ్రకులాల వారే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పదేళ్లు గడిచినా డబుల్ బెడ్రూం ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తామంటే నమ్మడం ఎలా? అని ప్రశ్నించారు. గాడిదలకు గడ్డి పెడితే... ఆవులు పాలిస్తాయా? అని కేసీఆర్ చెప్పారని.. ఇది నిజమేనని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఏమీ రాదని ఈటల ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామని తెలిపారు.