TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
Telangana Election 2024 voting percentage: మే 13న తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఓ ప్రకటన విడుల చేశారు.
TS Election 2024 voting percentage- హైదరాబాద్: తెలంగాణలో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65.67 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) మంగళవారం వెల్లడించారు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి 3 శాతం ఓటింగ్ పెరిగింది.
భువనగిరి ఓటర్లు భేష్..
అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.78 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నర్సాపూర్ సెగ్మెంట్‌లో 84.25 శాతం ఓటింగ్ నమోదు కాగా, మలక్‌పేట అసెంబ్లీ స్థానంలో అత్యల్పంగా 42.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. మల్కాజిగిరి పార్లమెంట్ లోని మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 3,85,149 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా మహబూబాబాద్ పార్లమెంట్ లోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో 1,05,383 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూన్ 4న 34 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటిగ్ ప్రక్రియ చేపడతామని వికాస్‌రాజ్ తెలిపారు.
నియోజకవర్గం | 2024లో పోలింగ్ | 2019లో పోలింగ్ శాతం | |
1 | ఆదిలాబాద్ | 74.03 శాతం | 71.42 % |
2 | పెద్దపల్లి | 67.87 శాతం | 65.59 % |
3 | కరీంనగర్ | 72.54 శాతం | 69.52 % |
4 | నిజామాబాద్ | 71.92 శాతం | 68.44 % |
5 | జహీరాబాద్ | 74.63 శాతం | 69.7 % |
6 | మెదక్ | 75.09 శాతం | 71.75 % |
7 | మల్కాజిగిరి | 50.78 శాతం | 49.63 % |
8 | సికింద్రాబాద్ | 49.04 శాతం | 46.5 % |
9 | హైదరాబాద్ | 48.48 శాతం | 44.84 % |
10 | చేవెళ్ల | 56.50 శాతం | 53.25 % |
11 | మహబూబ్ నగర్ | 72.43 శాతం | 65.39 % |
12 | నాగర్ కర్నూల్ | 69.46 శాతం | 62.33 % |
13 | నల్గొండ | 74.02 శాతం | 74.15 % |
14 | భువనగిరి | 76.78 శాతం | 74.49 % |
15 | వరంగల్ | 68.86 శాతం | 63.7 % |
16 | మహబూబాబాద్ | 71.85 శాతం | 69.06 % |
17 | ఖమ్మం | 76.09 శాతం | 75.30 % |
మొత్తం ఓటర్లు 3,32,16,348 (3 కోట్ల 32 లక్షల 16 వేల 3 వందల 48 మంది) కాగా, అందులో 2,20,24,806 (2 కోట్ల 20 లక్షల 24 వేల 8 వందల 6) మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 66.3 శాతమని ఈసీ పేర్కొంది. 2,20,24,806 మంది ఓటర్లలో 2,18,14,035 మంది ఓటర్లు 35,809 పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ ఓటింగ్ కేంద్రాలు, హోం ఓటింగ్, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో 2,10,771 మంది ఓటు వేశారు.