Telangana Election 2023 : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల - మరో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు ! ఇదే జాబితా
45 మందిఅభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల అయింది.
Telangana Election 2023 : కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థుల ఎంపికకు పలుమార్లు భేటీ అయి సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఎట్టకేలకు క్యాండిడేట్ల సెకండ్ లిస్ట్ లిస్ట్‌ను ఎనౌన్స్ చేసింది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మొదట లిస్ట్‌లో చోటు దక్కని పలువురు సీనియర్ నేతల పేర్లు సెకండ్ లిస్ట్‌లో దర్శనమిచ్చాయి. తీవ్ర పోటీ ఉన్న పలు సెగ్మెంట్లకు సైతం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది.
రెండో జాబితాలో కీలకమైన అభ్యర్థులకు చోటు లభించింది. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక నేతలు వ్యతిరేకించినా, బీఆర్ఎస్ కీలక నేత రామ్మోహన్ గౌడ్ పార్టీలో చేరినా ఎల్బీనగర్ టిక్కెట్ ను మధుయాష్కీ గౌడ్ కే కేటాయించారు. కాంగ్రెస్ హైకమాండ్ తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయనకు చాన్స్ దక్కింది. ఈ జాబితాలో పార్టీ ఫిరాయించిన వారికి ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు.
గ్రేటర్ లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న జగదీశ్వర్ గౌడ్ కు శేరిలింగంపల్లి , బండి రమేష్ కు కూకట్ పల్లి టిక్కెట్ కేటాయించారు. రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల సీటు ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. ఇప్పుడు మరో 45 మందితో జాబితా విడుదల చేసింది. దీంతో మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటికి పోటీ ఎక్కువగా ఉండటంతో కీలకమైన నేతలు.. తాము చెప్పిన వారికే ఇవ్వాలని పట్టుబడుతూండటంతో.. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. రెండు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి.. కాంగ్రెస్ అధ్యక్షురాలికి రిఫర్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కొంత మందికి టిక్కెట్లు ఖరారు చేసినా.. ఆ స్థానంలో అసంతృప్తుల్ని బుజ్జగించాడనికి లిస్ట్ పెండింగ్ పెట్టారు. మరో రెండు, మూడు రోజుల్లో మొత్తం స్థానాల జాబితాను హైకమాండ్ ప్రకటిస్తుందని కాంగ్రె్స వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. బీఫాంలు కూడా ఇచ్చి ప్రచార బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా టిక్కెట్ల కసరత్తును పూర్తి చేసింది. మూడో తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ లోపు మిగతా టిక్కెట్లను కూడా ఖరారు చేయనుంది. బీజేపీ రెండో జాబితాలో ఒక్క పేరునే ప్రకటించింది. ఇంకా ఆ పార్టీ 60కిపైగా స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. నవంబర్ ఒకటో తేదీనే ప్రకటిస్తామని కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.