Telangana Election 2023 : పోరాడమని పదవులిస్తే పార్టీ మారిపోయారు - తెలంగాణ బీజేపీకి కొత్త కష్టం తెచ్చిన సీనియర్లు !
తెలంగాణ బీజేపీలో వివిధ కమిటీల పదవులు పొందిన సీనియర్లు పార్టీలు మారిపోతున్నారు. ఆయా కమిటీలు చేయాల్సిన పనిని కూడా కిషన్ రెడ్డి చేసుకోవాల్సి వస్తోంది.
Telangana Election 2023 : తెలంగాణ బీజేపీని సమస్యల మీద సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీలో సీనియర్లు అందర్నీ ఎన్నికల్లో భాగం చేయడానికి రకరకాల కమిటీలు వేసి పనులు అప్పగిస్తే వారంతా పార్టీ ఫిరాయించేశారు. మరికొంత మంది సైలెంట్ అయ్యారు. దీంతో అభ్యర్థుల ఎంపిక సహా ఏ పనీ ముందుకు సాగడం లేదు.
కాంగ్రెస్‌లో చేరిపోయిన పలు కమిటీల నేతలు
ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీజేపీ హైకమాండ్ 14 కమిటీలు నియమించింది. వీరిలో ఒక్కరు కూడా యాక్టివ్ గా పని చేయడం లేదు. కొంత మంది నేరుగా పార్టీ మారిపోయారు. మ్యానిఫెస్టో, స్క్రీనింగ్ కమిటీల చైర్మెన్లు, ఎలక్షన్స్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపేందుకు వేసిన పోరాటాల కమిటీ చైర్మెన్ విజయశాంతి సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను ప్రభావితం చేసేందుకు వేసిన ప్రభావిత కమిటీ చైర్మెన్ కూడా పక్కపార్టీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో సమన్వయ కమిటీ చైర్మెన్ నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా వెళ్లిపోయారు.
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ జంప్‌తో అభ్యర్థుల ఖరారు ఆలస్యం
అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్టు తయారు చేయడంలో స్క్రీనింగ్ కమిటీది కీలక పాత్ర. ఈ కమిటీకి రాజగోపాల్‌రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన పార్టీ మారిపోయారు. దీంతో కిషన్‌రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు నేతలతో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయాల్సి వచ్చింది. అభ్యర్థుల తుది ఎంపిక జాప్యం కావడానికి ఇదీ ఒక కారణమైందనీ, హడావిడిగా షార్ట్ లిస్టు చేయడంతో అనేక పొరపాట్లు జరిగాయని ఆ పార్టీ కీలక నేతలు అంటున్నారు. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మెన్‌గా జితేందర్ రెడ్డి ఉన్నారు. తన కొడుకు గెలుపు కోసం ఆయన పాలమూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పార్టీ మార్పు - మేనిఫెస్టో ఎప్పుడో ?
కాంగ్రెస్ గ్యారంటీలకు..బీఆర్ఎస్ భరోసారి కౌంటర్ ఇచ్చేలా మేనిఫెస్టో రెడీ చేసుకోవాల్సిన బీజేపీ అసలు మేనిఫెస్టో గురించేఆలోచించడం లేదు. బీజేపీ మ్యానిఫెస్టో రూపకల్పన చైర్మెన్‌గా వివేక్‌ను నియమించారు. ఆయన పని పూర్తి చేయకుండానే పార్టీ మారిపోయారు. ఎన్నికల వేళ నాయకులందర్నీ సమన్వయ పరిచేందుకు, జాతీయ, రాష్ట్ర నేతల మధ్య కో-ఆర్డినేషన్ ఉండేలా చేసేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కేంద్రం సమన్వయ కమిటీ చైర్మెన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించింది. కానీ, ఆయనకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. త్రిపుర రాష్ట్రానికి పంపించింది. దీంతో రాష్ట్ర కేంద్రంలో సమన్వయం కరువైంది.
జనసేనతో పొత్తుపై సరిగ్గా సమన్వయం చేుసుకోలేని పరిస్థితి
జనసేనతో పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు. కానీ సమన్వయం చేసుకోలేకపోతున్నారు. జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న సీట్లలో నేతలు రాష్ట్ర ఆఫీసులో ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే పోరాటాలు జరగట్లేదు గానీ టికెట్లు దక్కని నేతలు రాష్ట్ర కార్యాలయం వద్ద రోజుకొకరు నిరసనలకు దిగుతున్నారు. ఇలా కమిటీలన్నీ నిర్వర్యం అయిపోతున్నాయి.