Telangana Election 2023: 50 కేంద్రాల్లో కౌంటింగ్-ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 50 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణలో ఈనెల 30న ఎన్నికల పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. 119 నియోజకవర్గాలకు సంబంధించి 50 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తించి... ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు పంపారు. ఆ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. దీంతో 50 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే పోలింగ్ తర్వాతే ఒక్కో నియోజవర్గానికి ఎన్ని టేబుల్స్ వేయాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు. లెక్కింపు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే పరిశీలకులను కూడా నియమించనున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు.
కౌంటింగ్ సమయంలో... ఏ రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది పరిశీలకుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో పరిశీలకుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతేకాదు.. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించబోతున్నారు. పోలింగ్ తర్వాత ఒక్కో నియోజకవర్గానికి ఎన్నో టేబుళ్లు వేయాలన్నది నిర్ణయిస్తారు. ఆ తర్వాత... మైక్రో అబ్జర్వర్లు ఎంత కావాలన్నది తేలుతుంది. దాన్ని బట్టి మైక్రో అబ్జర్వర్ల నియామకం జరుగుతుంది.
ఇక.. ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే... అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఆ ఐదు పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లు, వీవీప్యాట్లలోని ఓట్లు సరిగ్గా ఉంటే... ఫలితాన్ని ప్రకటించేందుకు పరిశీలకుడు అనుమతి ఇస్తారు. రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలను ఆయా కేంద్రాల బయట ఉన్న వారికి వెల్లడించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్ర దగ్గర మూడు అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. తొలి అంచెలో సాయుధ కేంద్ర బలగాలు, ఆ తర్వాత రెండు దశల్లో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని వినియోగించబోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప... భద్రతా బలగాలను కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతించరు. పోలింగ్ అయిపోయిన వెంటనే.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించేందుకు రూట్ మ్యాప్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. సాయుధ బలగాలు, సీసీటీవీ కెమెరాల నిఘా ఉండనుంది.
మరోవైపు... రాష్ట్రానికి 166 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. 39 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా, 67 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా, 60 మంది సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పరిశీలకులు వాటికి కేటాయియించిన ప్రాంతాలకు చేరుకుంటారు.
ఇక తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తాలు వెతుకుంటున్నారు అభ్యర్థులు.