Congress complaint to DGP : ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు - డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
Telangana Congress : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని డీజీపీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బెదిరించిన లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Congress complaint to DGP : కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లపై పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై 100 గంటలు గడవక ముందే ఇరు పార్టీల నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారని, బీజేపీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే విషయాన్నిఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అవస్థలు తప్పవని ఆ పార్టీకి భారీ మెజార్టీ లేకపోవడంతో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఆరు నెలలకో ఏడాదికో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చే ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. వరుసగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దుమారంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వల్ప మెజార్టీ ఉంది. మ్యాజిక్ మార్క్ 60 అయితే అంత కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ గెల్చుకున్నారు. అందుకే ఇతర పార్టీల నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీలోనూ వర్గ విబేధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ బలపరచడం లేదు. కనీసం పది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తారన్న అనుమానంతో ముందస్తుగానే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయ పరంగా చేసిన విమర్శలపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉంది.