Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam
అంబేద్కర్ కోనసీమ జిల్లా , అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రభల తీర్థం బుధవారం కనుల పండుగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది.జగ్గన్నతోట తీర్థంలో కొలువుతీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘేశ్వరం వ్యామ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీవిశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యామ్రేశ్వరస్వామి ప్రభలు తరలి వచ్చాయి. శిలాతోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలకరించారు.తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్ధనికి రాష్ట్ర నలు మూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారంవేరేశ్వర స్వామి ప్రభ,గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది.శరభ శరభ అశ్శరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజానా ఎత్తుకొని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్ధంలోకి ప్రభలను తీసుకువచ్చారు.తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరి చేల గట్లు , రోడ్డులు పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రభలు కౌశిక దాటిన తీరును జనం పోటీ పడుతూ మరీ ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్ర ధారణతో యువతీ, యువకులు పోటోల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది.వ్యాగ్రేశ్వరం నుండి వ్యాగ్రేశ్వరస్వామి ప్రభ తీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒక సారి పైకి ఎత్తారు.తీర్థం జరిగే ప్రాంతం వేలాది సంఖ్యలో జనం కిక్కిరిసిపోయింది.కొత్తపేట డిఎస్పీ వై.గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.





















