Telangana Congress: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 75 సీట్లు, కోమటిరెడ్డి దీమా - రాహుల్ హ్యాపీ అన్న సీతక్క
రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతో దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క తదితరులు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో ఏఐసీసీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి క్రిష్ణారావు తాము కాంగ్రెస్ పార్టీలో జూలై 2న చేరుతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతో దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క తదితరులు మీడియాతో మాట్లాడారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. తాము కచ్చితంగా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో 75 సీట్లలో విజయం సాధిస్తామని అన్నారు. జూన్ 27న హైదరాబాద్ లో స్ట్రాటజీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. అందులో మరిన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. దీంతో పాటు మేనిఫెస్టోపైన కూడా చర్చిస్తామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని, ఈ విషయాన్ని శరద్ పవార్ చెప్పారని గుర్తు చేశారు.
కేసీఆర్ లాగా తాము హామీలు ఇచ్చి విస్మరించబోమని చెప్పారు. తాము చేసేవి చెబుతామని, చెప్పినవి చేస్తామని అన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ బీజేపీని తిట్టడం లేదని, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.
రాహుల్ గాంధీ హ్యాపీ - సీతక్క
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉండడం సహజమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తాము అందరం ఐక్యంగా పని చేస్తామని తెలిపారు. పార్టీలోకి ఇప్పుడు వచ్చేవాళ్లే ఉన్నారు.. కానీ పోయేవాళ్లు ఉండబోరని అన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని సీతక్క దీమా వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లో చేరడంతో రాహుల్ గాంధీ ఆనందంగా ఉన్నారని సీతక్క అన్నారు.