Congress Jana Garjana: నేడే ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన, హాజరు కానున్న రాహుల్ గాంధీ
నేడు సాయంత్రం 3:30 గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న భారీ బహిరంగ సభ ‘జన గర్జన’ నేడే (జూలై 2) జరగనుంది. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడే ముగియనుండడం, జన గర్జన సభలోనే ఖమ్మం జిల్లా కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనుండడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకుంది.
నేడు సాయంత్రం 3:30 గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సభకి రానున్నారు. ఖమ్మం సభ తర్వాత రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఖమ్మం సభ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ 5.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. తిరిగి రాత్రి 7.30 గంటలకు రాహుల్ తిరుగు ప్రయాణం అవుతారు.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ కూటమి విజయం కోసం ఖమ్మంలో అప్పట్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగసభకు అప్పుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ జన గర్జన పేరుతో జరిగే సభకు ఖమ్మం రాహుల్ మళ్లీ ఖమ్మంకి వస్తున్నారు.
ఈ సభకు పెద్ద ఎత్తున జనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్ తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భట్టి పాదయాత్ర 1,360 కిలో మీటర్లు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మూడు నెలల కింద ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ప్రారంభించారు. శనివారం నాటికి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ యాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. ఈ ముగింపు సందర్భంగానే జన గర్జన సభను నిర్వహిస్తున్నారు.
వచ్చే డిసెంబరు నెలలోపే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహ రచన చేస్తుంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి పార్టీ అగ్ర నేతలు ప్రత్యేకంగా తెలంగాణలో రివ్యూలు చేస్తున్నారు. గత ఏప్రిల్ 14న మంచిర్యాలలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక మే 8న ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన సభలో పాల్గొన్నారు. ఇక రాహుల్ గాంధీ గత ఏడాది మే 6న వరంగల్ రైతు సంఘర్షణ సభ నుంచి వరుసగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ఆ తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగా అక్టోబర్ 30న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్, నవంబర్ 7న సంగారెడ్డి శివ్వంపేటలో బహిరంగ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం సభకు వస్తున్నారు.