Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో 120 రోజుల వ్యూహం, ఆ ఫార్ములానే ఇక్కడ కూడా -రేవంత్ రెడ్డి
తెలంగాణలో అనుసరించే వ్యూహాలపై, చేపట్టే కార్యక్రమాలపై రాహుల్ గాంధీతో చర్చించామని మాణిక్ రావు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వంద శాతం అధికారంలోకి వస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్ రావ్ థాక్రే అన్నారు. ఇకపై తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారని అన్నారు. నేడు (జూన్ 27) ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత మానిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక పార్టీ నేతలు మాట్లాడారు.
తెలంగాణలో అనుసరించే వ్యూహాలపై, చేపట్టే కార్యక్రమాలపై రాహుల్ గాంధీతో చర్చించామని మాణిక్ రావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు కాస్త ఆగ్రహంతో ఉన్నారని, పదేళ్ల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. కేసీఆర్ ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని అన్నారు. కాంగ్రెస్‌తో తెలంగాణ వికాస్ ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాణిక్ రావ్ థాక్రే విమర్శలు చేశారు. తాము చెప్పిన అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని అన్నారు. మేనిఫెస్టో రూపకల్పన తొందరగా పూర్తి చేయాలని చర్చ జరిపామని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపై చర్చ జరిగిందని అన్నారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిందని, కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అక్కడ అనుసరించిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ రెబెల్ గా మారకుండా అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైన కూడా ఫోకస్ పెట్టాలని అధిష్ఠానం సూచించిందని చెప్పారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేసి, కర్ణాటక తరహాలోనే వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించారని అన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమిలో బీఆర్‌ఎస్ పార్టీకి చోటు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ రాజభోగాలు అనుభవిస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌తోనూ రాష్ట్రంలో పొత్తు ఉండబోదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారని చెప్పారు.