KCR on BJP: మోదీ మాట్లాడటం ఆపి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి :కేసీఆర్
జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.
ఒక్కహామీ కూడా నెరవేర్చలేదు..
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సాదరంగా స్వాగతించిన ఆయన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా గొప్ప నేత అని కొనియాడిన కేసీఆర్ కేంద్రంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టార్చ్ లైట్ వేసి వెతికినా భాజపా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిన దాఖలా కనిపించదని విమర్శించారు. అన్నదాతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన భాజపా, వారి బాగు కోసం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. కనీస మద్దతు ధర కోసం రైతులు కొట్లాడితే వారినీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా భాజపా నాశనం చేసిందని, ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారని ఎద్దేవా చేశారు. తమకు మించిన మేధావులు ఇంకెవరూ లేరని భాజపా నేతలు అనుకుంటున్నారని అని అన్నారు.
భాజపా చేసిన చట్టాలు సరైనవే అయితే ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వస్తుందని ప్రశ్నించారు. రైతులతో పాటు యువకులు కూడా భాజపా ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల ముందు భాజపా తలదించుకునే పనులు చేస్తోందని విమర్శించారు. భాజపా హయాంలో ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అన్ని విషయంలోనే దేశ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారు..
నరేంద్ర మోదీ కన్నా ముందున్న ప్రధానులపై ఈ స్థాయిలో విమర్శలు రాలేదన్న కేసీఆర్, అసలు మీలో దేశభక్తి ఉందా అని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా పథకంపైనా మండిపడ్డారు. ఇదో అబద్ధపు పథకమని, దీని వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో ఏం జరుగుతున్నా భాజపా మౌనంగా ఉండిపోతోందని, తాము అలా ఉండలేమని స్పష్టం చేశారు, ఇంపోర్ట్ పాలసీపైనా విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా కాకుండా తమకు అనుకూలమైన వాళ్లకు సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అందరి ముందు తల దించుకునేలా చేస్తున్నారు..
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని భాజపా హామీ ఇచ్చిందని, కానీ ఖర్చుల్ని రెట్టింపు చేసిందని విమర్శించారు. భాజపా విధానాల వల్ల ఎన్నో సంస్థలు వెనక్కి వెళ్లిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈతీరు వల్ల అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్న మోదీ సర్కార్ ఎంత బ్లాక్‌మనీ వెనక్కి తెచ్చిందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహం పెరుగుతోందని స్పష్టం చేశారు. శ్రీలంక విషయంలో వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరముందని అన్నారు. దేశం అభివృద్ధి కాదు సర్వనాశనం అవుతోందని విమర్శించారు. ద్రవ్యోల్బణం పెరుగుతోందని, డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి విలువ తగ్గిపోతోందని గుర్తు చేశారు. రూపాయి విలువ ఎందుకింతలా పడిపోతోందో ప్రధాని మోదీ జవాబివ్వాలని డిమాండ్ చేశారు.
విద్వేషాలు పెంచుతున్నారు..
బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయని, గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎన్‌పీఏలు పెరగలేదని అన్నారు. MSMEలకు గంటలోనే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ నెలల తరబడి పడిగాపుడులు పడాల్సి వస్తోందని విమర్శించారు. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో గతంలో భారత్ ర్యాంక్ 111గా ఉండేదని, మోదీ వచ్చాక ఇది 136కి పడిపోయిందని అన్నారు. ప్రధాని పదవిలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, ఎంతో మంది వచ్చి వెళ్లిపోయారని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో జరిగినట్టుగానే తెలంగాణలోనూ సర్కార్ కూలిపోతుందని కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారని, దిల్లీ నుంచి వాళ్లను తప్పించే సమయంఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తనను తాను నిర్దోషి అని భావిస్తే సభలో ఈ అంశాలను ప్రస్తావించి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. యువతలో విద్వేషాలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతకండి, బతికించండి అన్న మౌలిక సూత్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో ఎప్పుడూ భారత్ జోక్యం చేసుకోదని, అలాంటిది ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లి ట్రంప్ కోసం ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు ట్రంప్ అధికారం నుంచి వెళ్లిపోయాడని, మరి ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని అన్నారు. జాతిపిత మహాత్మ గాంధీని కూడా అవమానిస్తున్నారని విమర్శించారు. దేశంలో మార్పు కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని,ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గిపోలేదని ఈ సభతో రుజువైందని వెల్లడించారు.