(Source: ECI/ABP News/ABP Majha)
Revanth Reddy: హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి వినతి
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సోమవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, మరో మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు.
Revanth Reddy urges Union Govt to include Hyderabads Sewerage Master Plan in AMRUT 2.0| న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలా చేర్చడానికి కుదరని పక్షంలో ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి ఖట్టర్‌ను రేవంత్ రెడ్డి సోమవారం (అక్టోబ్ 7న) కలిశారు.
ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీలో పాతకాలం నాటి మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రజల ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయి నగరాలల ఉండాలంటే నగరంతో పాటు ఆ మున్సిపాలిటీల్లో 100 శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు వివరించారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల 27 పురపాలక సంఘాలతో కలుపుకొని కలిపి 7,444 కి.మీ.మేర రూ.17,212.69 కోట్లతో సీఎస్ఎంపీ (Hyderabad CSMP)కి డీపీఆర్ రూపొందించామని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఆ డీపీఆర్‌ను ఖట్టర్‌కు అందజేశారు. ఈ ప్రాజెక్టును అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. లేకపోతే వేరే ఏదైనా ప్రత్యేక ప్రాజెక్టుగానై సరే గుర్తించి నిధులివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
నగరంలో మూసీ మురుగు
హైదరాబాద్ లో మూసీ నది 55 కి.మీ. మేర ప్రవహిస్తోంది. ఇరువైపులా కలిపి 110 కి.మీ.మేర నగరంలోని మురుగు మూసీలో చేరుతోందని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, ట్రంక్ సీవర్స్ మెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించామన్నారు. ఆ డీపీఆర్‌ను ఆమోదంతో పాటు పనుల అనుమతికి కేంద్రం చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Also Read: Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సహకారం
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశ విస్తరణలో భాగంగా నాగోల్- శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ (36.8 కి.మీ.), రాయదుర్గం- కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.), ఎంజీబీఎస్ (MGBS)- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్- పటాన్‌చెరు (13.4 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయినట్లు మనోహర్‌లాల్ ఖట్టర్‌కు తెలియజేశారు. ఈ కారిడార్ల నిర్మాణానికి ఖర్చు రూ.24,269 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. డీపీఆర్‌ను త్వరలో సమర్పిస్తామని.. పనులు త్వరగా జరిగేటట్లు సహకరించాలని సీఎం కోరారు.