Revanth Reddy on Kaleshwaram Report: హరీష్ రావు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. రికార్డుల నుంచి అవి తొలగించండి: రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: అసంపూర్తి సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.38 వేల కోట్లతో నిర్మించాల్సిన బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి, రూ.87 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని, ప్రస్తుతం దాని వ్యయం రూ.1 లక్షా 47 వేల కోట్లకు చేరిందని.. లక్ష కోట్లు వృథా అని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగిన హరీష్ రావు
ఈ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 8బీ కింద తమకు నోటీసులు ఇవ్వలేదని, 660 పేజీల నివేదికపై అరగంటలో చర్చించాలంటే ఎలా సాధ్యమవుతుందని సభలో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు హరీష్ రావు. మాజీ మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు అసంపూర్తి సమాచారం మీద ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. 2014 అక్టోబర్ 24న అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి స్వయంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉందని, హైడ్రాలజీ అనుమతులు లభిస్తున్నాయని స్పష్టంగా తెలిపారు. అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్ రావు వ్యాఖ్యలను శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని కేంద్రం లేఖ రాస్తే కూడా, హరీష్ రావు మళ్లీ పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతూ మరో లేఖ రాశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆ ఎన్నికను పరిశీలించాలని అడిగినట్టు ఇది కాదా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉందని అనుమతులు ఇచ్చిన దాఖలాలున్నాయని, వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోని నిజాలు వెలుగులోకి రావడంతో, ఆ నివేదికను ధిక్కరించే ప్రయత్నం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నివేదికలోని 98వ పేజీలో హరీష్ రావు చేసిన తప్పులపై స్పష్టంగా వివరాలు ఉన్నాయని చెప్పారు. విచారణ కోసం సీబీఐ కావాలా, లేదా సీబీ సీఐడీ కావాలా అన్న విషయంలో స్పష్టత ఇవ్వకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు.
హరీష్ రావు ఏమన్నారంటే..
ఇవాళ మనం ఎక్కడ ఉండాలి అధ్యక్షా? ప్రజలు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో, వాళ్లతోపాటు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో, ఈ అసెంబ్లీలో బురద రాజకీయం చేయడం అవసరమా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆదివారం రోజే ఈ చర్చ పెట్టడం వెనుక అసలైన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సెక్షన్ 8బి, 8సి నిబంధనలు పాటించకపోవడం వల్లే మేం కోర్టును ఆశ్రయించాము. ఈ అంశంపై హైకోర్టు ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టంగా ఆదేశించింది.
ఈ ప్రభుత్వం సుప్రీ కోర్టులో కెవియట్ దాఖలు చేసింది. అంటే, మేము ఎప్పుడైనా సుప్రీం కోర్టుకు వెళ్లి విచారణ కమిషన్‌ను రద్దు చేయించవచ్చననే భయంతో ముందస్తుగా అలర్ట్ అయ్యారు. కమిషన్ నివేదిక నిలబడదని, ఎప్పుడైనా కోర్టు స్టే ఇవ్వవచ్చని ముందే తెలుసుకుని, ఈ నివేదికపై ఆదివారం రోజే అసెంబ్లీలో చర్చ పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
డ్రామా కంపెనీలా రేవంత్ ప్రభుత్వం
పీసీ ఘోష్ కమిషన్ నివేదికల విడుదలకు వెనుక ఉన్న రాజకీయ లెక్కలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటీరిమ్ రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సమయానికి తుది నివేదిక... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ప్రభుత్వం నిజంగా పాలన నడుపుతుందా? లేక డైరెక్షన్ ఉండే డ్రామా కంపెనీలా వ్యవహరిస్తుందా అనే సందేహం సహజంగా రావాల్సిందేనని హరీష్ రావు అన్నారు.






















