Telangana Crop Loans: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, కటాఫ్ డేట్ వెల్లడించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy Crop Loans | రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Telangana Rythu Runa Mafi | హైదరాబాద్: మే 6, 2022న వరంగల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సోనియా గాంధీ మాట చెప్పారంటే అది శిలా శాసనం అన్నారు.
సోనియా గాంధీ మాట అంటే శిలాశాసనం..
‘వరంగల్ డిక్లరేషన్ లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని కొందరు కామెంట్లు చేశారు. కానీ తమ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని భావించింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ లో చర్చించి రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా తొలిసారి రూ.16 వేల కోట్ల రుపాయాలు ఖాతాల్లో వేశారు. రెండోసారి రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు విడతల్లో చేసిన రుణమాఫీ రూ.28 వేల కోట్లు.
బీఆర్ఎస్ 10 ఏళ్లలో రూ.28 వేల కోట్లు మాఫీ
డిసెంబర్ 11, 2018 వరకు కటాఫ్ డేట్ గా పరిగణనలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు గత ఐదేళ్లను కటాఫ్ డేట్ గా తీసుకుని రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రైతు రుణమాఫీ కోసం రూ.31,000 కోట్లు అవసరం. నిధులు సమీకరించి అన్నదాతల రుణాలు మాఫీ చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని రాష్ట్ర ప్రజలకు చాటుతాం’ అన్నారు రేవంత్ రెడ్డి.
మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
గత ప్రభుత్వం రూ.1 లక్ష రైతు రుణమాఫీ అని ప్రకటించి నాలుగు వాయిదాలలో అన్నదాతలకు నగదు ఇచ్చారు. కానీ వడ్డీల భారం పెరగడంతో పాటు వ్యవసాయం చేయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కనుకనే తాము ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తాం, ఓ నివేదిక తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. జులై 15వ తేదీలోపు నివేదిక తయారుచేసి, బడ్జెట్ లో ఇది కలిపి నిబంధనలకు అనుగుణంగా అందరికీ అందజేయాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.