Revanth Reddy House Wall Demolished: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ కూల్చివేసిన అధికారులు, ఏ చర్యలుండవు
Revanth Reddy Native KondaReddy Pally | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆయన ఇంటి ప్రహరిని అధికారులు రెండు రోజులక కిందట కూల్చివేశారు.

Telangana Latest News Today | వంగూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇంటి ప్రహరీని అధికారులు రెండురోజుల కిందట కూల్చివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం ఇంటి గోడను సిబ్బంది కూల్చివేశారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో నాలుగు వరుసల తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన చర్యలలో గ్రామంలో పలువురి ఇండ్లు, కొందరి ప్రహరీలు కూల్చివేశారు. ఈ క్రమంలో గ్రామంలోని 43 మంది ఇళ్లతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని కూడా అధికారులు పడగొట్టారు.
ప్రస్తుతం కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల క్రితం ఆదేశించారని తెలిసిందే. దాంతో సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ దేవసహాయం తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొందరు ఇండ్లు కోల్పోగా, సీఎం రేవంత్ సహా మరికొందరి ఇండ్ల ప్రహరీ కూల్చివేశామన్నారు.
కొండారెడ్డిపల్లెకు సీఎం వరాలు, నేడు కార్యరూపం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. ఆ సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తన స్వగ్రామంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పారు. స్వగ్రామంలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సీఎం హోదాలో స్వగ్రామానికి రావడం, అక్కడ పండుగ వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. కన్నతల్లిని, పుట్టిన ఊరును పట్టించుకోకపోతే అది మనిషి పుట్టుక కాదు అని.. కొండారెడ్డిపల్లి రూపురేఖలు మార్చుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి.






















