Revanth Reddy Harvard: హార్వార్డ్ క్లాసులకు విద్యార్తిగా హాజరవుతున్న తెలంగాణ సీఎం - గడ్డకట్టే చలిలోనూ లీడర్‌షిప్ కోర్సు
Harvard classes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్తిగా మారారు. హార్వార్డ్ లో లీడర్ షిప్ కోర్సు క్లాసులకు హాజరవుతున్నారు.

Telangana CM attending Harvard classes Leadership course : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ఒక ప్రతిష్ఠాత్మక ఐవీ లీగ్ యూనివర్సిటీలో నాయకత్వ శిక్షణ పొందుతున్న తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుకెక్కారు. అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో 21వ శతాబ్దం కోసం నాయకత్వం: అస్తవ్యస్తత, సంఘర్షణ మరియు ధైర్యం (Leadership in the 21st Century: Chaos, Conflict, and Courage) అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఆయన విద్యార్థిగా చేరారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో భాగంగా తొలిరోజు ఓరియంటేషన్ అనంతరం అథారిటీ , లీడర్‌షిప్ విశ్లేషణ అనే అంశంపై జరిగిన సెషన్‌లో ఆయన పాల్గొన్నారు.
ఏమిటీ కోర్సు? దీని ప్రత్యేకతలేంటి?
ఈ వారం రోజుల కోర్సు కేవలం అధికార హోదా గురించి కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వాన్ని ఒక ఆచరణాత్మకంగా గా ఎలా మలచుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తుంది. హార్వర్డ్ ప్రొఫెసర్లు టిమ్ ఓ'బ్రియన్, కరెన్ మోరిస్సీల నేతృత్వంలో సాగే ఈ ప్రోగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, నాయకులు భాగస్వాములవుతున్నారు. రాజ్యాంగబద్ధమైన అధికారంతోనే కాకుండా, సామాజిక మార్పు కోసం ప్రజలను ఎలా సమీకరించాలి, వ్యవస్థల్లో ఉండే ప్రతిఘటనలను ఎలా అధిగమించాలనే అడాప్టివ్ లీడర్‌షిప్ మెళకువలను ఇందులో బోధిస్తారు.
శిక్షణలో రేవంత్ రెడ్డి దినచర్య
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, అక్కడ రేవంత్ రెడ్డి ఒక సాధారణ విద్యార్థిలాగే గడుపుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో కేస్ స్టడీస్ విశ్లేషణ, రాతపూర్వక అసైన్‌మెంట్లు, హోంవర్క్ ,గ్రూప్ ప్రాజెక్టులు వంటివి భాగంగా ఉన్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతో కూడిన చిన్న చిన్న బృందాల్లో చర్చలు జరపడం, తమ పనిలో ఎదురయ్యే సవాళ్లను ఒకరితో ఒకరు పంచుకుని పరిష్కారాలు అన్వేషించడం ఈ శిక్షణలో కీలక ఘట్టం. రాత్రి పొద్దుపోయే వరకు ఈ విద్యా సంబంధిత కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
CM A Revanth Reddy began his executive education at Harvard Kennedy School, Cambridge, with orientation and cohort introduction.
— Naveena (@TheNaveena) January 26, 2026
The program, Leadership in the 21st Century, opened with a session on Analysing Authority and Leadership. pic.twitter.com/s9XSyHl8Li
పాలనలో మార్పు దిశగా..
తెలంగాణను గ్లోబల్ స్థాయిలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డి, ఆధునిక పరిపాలనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. జనవరి 31 వరకు సాగే ఈ శిక్షణ ముగిశాక, ఆయన హార్వర్డ్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందుకోనున్నారు. ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక, అక్కడ నేర్చుకున్న అంతర్జాతీయ స్థాయి నాయకత్వ మెళకువలను రాష్ట్ర పాలనలో, ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల అమలు , క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలో అమలు చేసే అవకాశం ఉంది.


















