Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతిచెందారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇది బుటకపు ఎన్ కౌంటర్ అని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపిస్తుంది. ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27న బంద్ ప్రకటించింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు పక్కా సమాచారంతో మావోయిస్టులను దొంగదెబ్బ తీశారని సీపీఐ(మావోయిస్టు) ఆరోపించింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. దాడిని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో చేయించిందన్నారు. ఇది ముమ్మాటీకి బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారి స్వంత లాభాల కోసం ప్రజా పోరాటాలు చేస్తున్న విప్లవకారులను హత్యలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎంల భేటీ తరువాత వ్యూహాత్మకంగా సమాధాన్ దాడులు చేస్తు్న్నారని సీపీఐ(మావోయిస్టు) ఆరోపించింది.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
ఈ నెల 27న బంద్
ఈ దాడిలో ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారని సీపీఐ(మావోయిస్టు) తెలిపింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా జారవేడకు చెందిన నరోటి దామాల్ (ఏసీఎం), బీజాపూర్ జిల్లా బాసగూడెం మల్లిపాడు గ్రామానికి చెందిన సోడి రామాల్, బీజాపూర్ జిల్లా గంగులూర్ ఎరియా పెద్ద కోర్మ గ్రామానికి పూనెం బద్రు మృతిచెందారన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం తమ కుటుంబాలను విప్లవోద్యంలో చేరారని తెలిపింది. ఈ ముగ్గురు నీరు పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారని, పీడిత ప్రజల విముక్తి కోసం తమ కుటుంబాలను, వ్యక్తి గత ప్రయోజనాలను వదిలిపెట్టి విప్లవోద్యంలో చేరారని తెలిపింది. ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27న బంద్ పాటిస్తున్నామని విప్లవ శ్రేణులు, ప్రజలు, వ్యాపార యాజమాన్యులు అందుకు సహకరించాలని మావోయిస్టు పార్టీ కోరింది.
Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్
ములుగు జిల్లా తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. వాజేడు మండలం టేకుల గూడెం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని తనిఖీలు చేపట్టారు. అన్ని వాహనాలను నిలిపోయివేసి ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తున్నారు. అనుమానితుల వివరాలు సేకరించి స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు ప్రతీకార చర్య ఉంటుందని బంద్ ప్రకటించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ముగ్గురు మావోయిస్టుల హతం : ములుగు ఎస్పీ
తెలంగాణ ములుగు జిల్లా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులలో దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టుగా ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటించారు. సోమవారం ములుగు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యలు చేయడం, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి వ్యూహరచన చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. నమ్మదగిన సమాచారంతో సోమవారం ఉదయం ములుగు పోలీసులు, బీజాపూర్ పోలీసులు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులు పోలీసు దళాల పైకి కాల్పులు జరపగా ప్రత్యేక దళాలు ఎదురు కాల్పులు జరిపారని తెలిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు, మరికొన్ని వస్తువులు లభ్యమయ్యాయని వివరించారు. కొంతమంది మావోయిస్టులు పారిపోయారని వారి కోసం పోలీస్ ప్రత్యేక దళాలు ఏటూరునాగారం, వాజేడు, పేరూరు, వెంకటాపురం అటవీ ప్రదేశంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. కాల్పులు జరిగిన సంఘటన ప్రదేశం ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు.
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి