Telangana Cabinet Meeting: ఈ 8న తెలంగాణ కేబినెట్ భేటీ, 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
TS Cabinet Meeting: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి తొలి బడ్జెట్ సమావేశాలు నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8 తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.
Telangana Assembly Sessions: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి తొలి బడ్జెట్ సమావేశాలు నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. అంతకుముందు ఈ నెల నాలుగో తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మంత్రి వర్గ సమావేశంలో ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీలపై చర్చించడంతోపాటు అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వీటిలో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసే అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ రెండు పథకాలతోపాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుక దోహదం చేసినవిగా భావిస్తున్న మరో రెండు, మూడు పథకాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
బడ్జెట్ సమావేశాలు
మంత్రి వర్గం సమావేశం తరువాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ సమావేశాలు ఉండనున్నాయి. తొలి ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తొమ్మిదో తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. పదో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12 నుంచి ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తరువాత తొలిసారి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాన పార్టీల నాయకులు వ్యవహారశైలి, వాడి, వేడి చర్చ జరిగే అవకాశముందని అంతా భావిస్తున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన తరువాత గురువారం ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజులు కిందట నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు. సర్జరీ తరువాత కేసీఆర్ కోలుకోవడంతోపాటు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన నేపథ్యంలో.. ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు.