Funds for Irrigation: స్వర్ణయుగంగా సాగురంగం, నీటిపారుదలకు రూ.26,885 కోట్లు: హరీశ్ రావు
భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా మారిందని హరీశ్ రావు అన్నారు. అన్నపూర్ణగా అవతరించిందని అభివర్ణించారు.
సాగు నీటి రంగంలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు చేసిందన్నారు మంత్రి హరీష్ రావు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. నేడు మాత్రం సాగు రంగంలో స్వర్ణయుగంగా మారిందన్నారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా మారిందన్నారు. అన్నపూర్ణగా అవతరించిందని అభివర్ణించారు. ఈ బడ్జెట్ 2023-24 లో రూ.26,885 కోట్లు కేటాయించారు.
చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకాతీయ పథకాన్ని ప్రవేశ పెట్టారని.. దీని వల్ల ఊళ్లల్లోని చెరువులకు పునర్వైభవం వచ్చిందన్నారు హరీష్. చెరువులకు ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం వల్ల వేసవిలో కూడా జల కళ ఉట్టిపడుతోందన్నారు. ఫలితంగా 15 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ పొందిందని సభకు తెలిపారు. కేంద్రం చేపట్టే అమృత్ సరోవర్ పథకానికి మిషన్ కాకతీయ పథకం ప్రేరణగా నిలిచిందన్నారు. వివిధ రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నట్టు వివరించారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసిందన్నారు హరీష్. ఫలితంగా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయిందని తెలిపారు. కరవు జిల్లాగా పేరున్న పాలమూరు నేడు పంటలతో పచ్చగా మారిందని చెప్పారు.
3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్‌లు నిర్మాణం జరిగిందన్నారు. వీటిలో మొదటి దశ 650 చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తైందన్నారు. మిగతా చెక్‌డ్యాముల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి, సస్యశ్మాలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు 60 శాతం పనులు పూర్తైన తరుణంలో కొందరు కోర్టుకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే వాటన్నింటికీ పరిష్కారం తీసుకొచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఖమ్మం జిల్లా కరువు తీరుస్తామన్నారు హరీష్. పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేస్తామన్నారు.
కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడిందన్న హరీష్.. రానున్న రెండు మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. కోటికిపైగా ఎకరాల ఆయుకట్టును సృష్టించాలనే సంకల్పంతో సాగుతున్నామన్నారు. తెలంగాణ చేస్తున్న యజ్ఞానికి తోడ్పడకపోగా.. అడ్డంకులు సృష్టించి అడ్డుకుంటున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు హరీష్ రావు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే తాత్సారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించలేదని అన్నారు. ఎవరు ఏం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ప్రయత్నిస్తున్నామన్నారు హరీష్. అందుకే ఈసారి బడ్జెట్‌లో 26, 885 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ ప్రవేశ పెట్టిన అనేక పథకాల్లో మిషన్ భగీరథ చాలా అద్భుతాలు సాధించిందన్నారు హరీష్‌రావు. ఇదే స్ఫూర్తితో కేంద్రం హర్‌ఘర్ జల్ యోజన తీసుకొచ్చిందని వివరించింది. దీని కారణంగానే తెలంగాణలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా విరగడైపోయిందన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రలం తెలంగాణ అని 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు హరీష్. 2022 అక్టోబర్ 2 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ జీవన్ అవార్డుల్లో మిషన్ భగీరథ ప్రథమ బహుమతి లభించిందని గుర్తు చేశారు.
44,933.66కోట్ల అంచనాతో ప్రారంభమైన మిషన్ భగీరథను అతి తక్కువ సమయంలో.. 36,900కోట్లతో పూర్తి చేశామన్నారు. కచ్చితతమైన ప్రణాళికతో, అత్యంత పారదర్శకంగా, ఆధునిక పద్ధతులు వినియోగించామన్నారు. ఫలితంగానే 8,033.66కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేశామన్నారు.