BJP Vs TRS : రాజకీయతెరపై ఈడీ కేసుల సినిమా, మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్!
Bjp Vs Trs : బీజేపీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్న విమర్శలకు ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ను ఈడీ విచారణకు పిలుస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Bjp Vs Trs : తెలంగాణ సీఎం కేసీఆర్ ని తక్కువ అంచనా వేస్తున్నారా? లేదంటే కేసీఆర్ బీజేపీ, ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత బండి సంజయ్ నిజమని ప్రకటిస్తున్నారా? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో నడుస్తోన్న చర్చ. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే నొక్కి చెబుతోంది ఏంటంటే దొరగారు త్వరలో జైలు కెళతారు అని. ఎప్పుడు ఏ విధంగా అని మాత్రం అడక్కండి. త్వరలో రాజకీయతెరపై కేసీఆర్-మోదీ అనే సినిమా విడుదల కానుంది అని రాజకీయ విశ్లేషకులు సెటైరికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
కేసీఆర్ ను టార్గెట్ చేశారా?
జయాపజయాలు మామూలే అంటూ బీజేపీ గెలుపుని తక్కువ అంచనా వేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అంతేకాదు ప్రధాని మోదీ నిర్ణయాలన్నింటికీ తల ఊపి తప్పు చేశామని నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. గెలుపు బలుపు చూసుకొని ఎగిరెగిరి పడితే ఎక్కడపడతారో కూడా తెలియదన్నట్లు టీఆర్‌ఎస్ శ్రేణులు మాట్లాడారు. ఇప్పుడు కాషాయం ఆ మాయలోనే కేసీఆర్ ని టార్గెట్ చేసిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయనపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారంటోంది. ఆ మాటలు నిజమేగా అంటూ బండి సంజయ్ కేసీఆర్ బండారాన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. ఆ దిశగా ఇప్పటికే అన్నిశాఖల్లోని వివరాలను కావాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తులు కూడా చేశారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా విన్న తెలంగాణ సీఎం ఎప్పటిలాగానే స్పందించారు.
మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే అంతేనా
గంతే కదా బీజేపీ, ప్రధాని మోదీ చేసేది! వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే..వాళ్ల తప్పుని ఎత్తి చూపితే సీబీఐ కేసులు పెడతారు. ఈడీ విచారణకు పిలుస్తారు..ఇంకా లెక్కలేనన్ని కేసులు పెడతారు. మీరు రోజు చూడటం లేదా? మీకు తెలియదా? ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు మోపారో మీరు చూస్తున్నారు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు చేతనైంది చేసుకోమనండి. నాకేమన్నా భయమా.. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడడు. చూసుకుందాం. ఏం జరుగుతుందో అని మొన్ననే తెలంగాణ సీఎం సవాల్ కూడా విసిరారు.
సోనియా గాంధీలా కేసీఆర్ కూడా
కేసీఆర్-కేటీఆర్ సవాళ్లకి ఎప్పుడూ సై అనే బండి ఇప్పుడు కూడా అదే మాటను మళ్లీ వినిపించారు. దొరగారికి టైమ్ దగ్గరపడిందని ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈడీ విచారణకు వస్తున్నట్లే త్వరలో కేసీఆర్ కూడా వస్తారని స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కోవడానికి మళ్లీ కాంగ్రెస్ తో కేసీఆర్ చీకటి బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
బండి సంజయ్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన డైరెక్ట్ గా మోదీకే ట్వీట్ చేశారు. Bandi Sanjay ని ఏమైనా ఈడీ చీఫ్ గా నియమించారా? అంటూ సెటైర్ వేశారు. ఆ ట్వీట్ లో కేటీఆర్ ఏమన్నారంటే... ప్రియమైన భారత ప్రధాని మోదీ గారికి..మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ని కూడా ED చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీన్ని టీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం తెగ తిప్పుతోంది.
సీబీఐ , ఈడీ కేసులు
సీఎం కేసీఆర్ ఆరోపించినట్లు మోదీకి ఎదురుతిరిగితే వాళ్లపై సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్న విమర్శలున్నాయి. విపక్షాలన్నీ అదే మాట వినిపించడంతో సామాన్యులకి కూడా అదే అనుమానాలున్నాయి. ఇప్పుడవి నిజమన్నట్లు బండి సంజయ్ చెబుతున్నారు. రాజకీయంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ని దెబ్బతీయాల్సిన అవసరం బీజేపీ, అలాగే ప్రధాని మోదీకి లేదని..తెలంగాణ ప్రజలను ఆ కుటుంబం ఏ రకంగా ఎలా దోచుకుందో ఆధారాలతో చూపిస్తే మంచిదని బండి సంజయ్ కి సలహా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా రాజకీయ లబ్ది కోసం ఇలాంటి కేసులు పెడితే రానున్న రోజుల్లో తెలంగాణలో కమలానికి ప్రజలు కటీఫ్ చెప్పేస్తారని సూచిస్తున్నారు.