Telangana Waterfalls:ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో....
అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు వింటేనే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జలపాతాలు హొయలొలుకుతున్నాయ్. తొలకరి జల్లులకు జిల్లాలో జలపాతాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయ్.
కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు భూతల స్వర్గం అనిపిస్తుంది. ఆ ప్రదేశాల్లో ఉంటే మనల్ని మనం మరిచిపోతాం. ఎంతో భారమైన హృదయాలు కూడా దూదిపింజల్లా తేలియాడుతాయ్. మండే ఎండల్లో మాయమైపోయిన ప్రకృతి.... తొలకరి జల్లులు పలకరించగానే చివురులు తొడుక్కుంటుంది. పురివిప్పిన నెమలిలా చూపుతిప్పుకోనివ్వదు. వరుణుడి జోరుతో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకృతిని చూసి...ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో అని పాటందుకోకుండా ఉండగలమా....
కొండల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు.
బొగత కళకళ
ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం కళకళలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. చిలుకల పార్క్, ప్రకృతి అందాలు చూస్తూ పర్యాటకులు మైమరిచిపోతున్నారు...
సదర్‌మాట్ సవ్వడులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరందించే సదర్‌మాట్ జల సవ్వడులతో మురిపిస్తోంది. జల్లుల జోరుతో కనీస నీటిమట్టం 7.6 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర నుంచి వరద ప్రవహిస్తోంది.
భీమునిపాదం
గుట్టలపైనుంచి భారీగా చేరుతున్న వరదనీటితో భీమునిపాదం జలపాతం ఆహ్లాదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపం అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. అంత మారుమూల ఉన్నప్పటికీ పర్యాటకుల తాకిడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
సైదాపూర్
చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. కొండల మధ్య సహజ సిద్ధంగా జాలువారే నీటి హొయలు... ప్రకృతి రమణీయతను దాచుకున్న అద్భుత చిత్రం 'రాయికల్ జలపాతం'. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సాధారణ రోజుల్లో కన్నా వీకెండ్ వస్తే అక్కడ సందడే వేరు. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులు సేదతేరే ప్రాంతంగా ఉండే ఈ రాయికల్ జలపాతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
మనసుదోచే...సప్తగుండాల
మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఉన్న మిట్టే జలపాతాలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది.