Batukamma Sarees: తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక.. బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం... నేతన్నల జీవనస్థితి మారిందన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ 3 కోట్ల 90 లక్షల చీరలను పంపిణీ చేశామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డు కింద నమోదు అయిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందిస్తామని, ఇప్పటికే అన్ని గ్రామాలల్లో చీరల పంపిణీ కార్యక్రమానికి అవసరం అయిన ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు పంపిణీ కార్యక్రమాలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
Also Watch : సర్పంచ్‌లు ఏమైపోతారోనని ఓ భయముంది: అసెంబ్లీలో కేసీఆర్
నేతన్న వేతనాలు రెట్టింపు
తెలంగాణలోని నేతన్నలకు ఆదాయం కల్పించడం, బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డలకు చీరలను అందించే రెండు ఉద్దేశ్యాలతో 2017లో బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంతో నేతన్నలకు నిరంతరం పని కల్పిస్తూ వారి జీవన స్థితిని, నైపుణ్యాన్ని పెంచగలిగామన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించాక రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న పవర్ లూమ్ కార్మికుల వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తెలంగాణలోని సుమారు 20 వేల మంది పవర్ లూమ్ నేత కార్మికులకు చేతి నిండా పనిదొరికిందన్నారు. దీంతో నేతన్న ఆత్మహత్మలు తగ్గాయన్నారు. ఈ ప్రాజెక్టుతో నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచగలిగామని, వారిప్పుడు నూతన డిజైన్లు, వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
Also Read: టీఆర్ఎస్ గూండాళ్లాగా పోలీసులు.. జంగ్ సైరన్ భగ్నం చేయాలని కుట్ర.. మధు యాష్కీ ఆరోపణ
ఇప్పటి వరకూ 3 కోట్ల 90 లక్షల చీరలు పంపిణీ
2017 నుంచి గత ఏడాది వరకు 3 కోట్ల 90 లక్షల చీరలను పంపిణీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2017లో 95,48,439, 2018 లో 96,70,474, 2019 లో 96,57,813, 2020లో 96,24,384 చీరలను ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా పంపిణీ చేశామన్నారు. ప్రతి ఏడాది చీరల తయారీ, పంపిణీ ప్రక్రియలో మార్పులు తీసుకువస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చీరల నాణ్యత, డిజైన్లు, రంగుల ఎంపిక వంటి వాటిలో రాష్ర్టంలోని మహిళలకు క్షేత్ర స్థాయి నుంచి ప్రాతినిధ్యం ఉన్న మెప్మా(MEPMA), సెర్ఫ్ (SERP) స్వయం సహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, నిఫ్ట్ డిజైనర్లతో రూపొందించిన డిజైన్ లతో చీరలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాల అనుభవం, నైపుణ్యాభివృద్ధి నేపథ్యంలో నేతన్నలు నూతనంగా డాబీ/జాకార్డు డిజైన్లతో చీరలను ఉత్పత్తి చేశారన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 333.14 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి