TPCC: టీఆర్ఎస్ గూండాళ్లాగా పోలీసులు.. జంగ్ సైరన్ భగ్నం చేయాలని కుట్ర.. మధు యాష్కీ ఆరోపణ
శాంతియుతంగా తాము చేపట్టనున్న పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల కోసం శాంతియుతంగా జంగ్ సైరన్ ప్రారంభించామని మధు యాష్కీ తెలిపారు. దీనిలో భాగంగా ఈరోజు దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. శాంతియుతంగా తాము చేపట్టనున్న పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. మొన్న ఓయూలో కోట శ్రీనును.. ఈరోజు ఎల్బీ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి తదితరులను అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్ గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..
ఉద్యోగాల పేరిట మోసం..
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్‌లు ఉద్యోగాల పేరుతో విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేశాయని మధు యాష్కీ ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్న యువత నేడు మళ్లీ ఉద్యోగాల కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ నియంత పోకడలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. దొరల పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నేడు తాము నిర్వహించనున్న యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాదయాత్ర శాంతియుతంగా జరిగే విధంగా సహకరించాలని పోలీసులను కోరారు.
Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... కీలక బిల్లుకు శాసనసభ ఆమోదం
2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలి: మల్లు రవి
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండు కళ్లు లాంటి వారని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. వారి ఆశయాలను, సిద్ధాంతాలను దేశ, రాష్ట్ర పాలకులు అనుసరించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని తెలిపారు. శాంతియుత నిరసనను అణచివేయడం తగదని అన్నారు. అహింస పోరాటాన్ని అణచివేస్తే హింసాయుత పోరాటానికి దారి తీస్తుందని హెచ్చరించారు. యాత్రకు మొన్నటి వరకు పర్మిషన్ ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టులు చేయడం ఏంటని నిలదీశారు. ఇలాంటి విపరీత పోకడలకు పోతే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. నేడు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్బంగా టీపీసీసీ నేతలు వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అజ్మత్ హుసేన్ కన్వీనర్, నేరేళ్ల శారద, బాల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?