Telangana TextBook Controversy : రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ , సెక్యులర్ పదాలు మిస్సింగ్ - తెలంగాణ విద్యాశాఖ అధికారుల ఘోర తప్పిదంతో వివాదం !
సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేకుండా రాజ్యాంగ పీఠికను టెక్ట్స్ బుక్‌లో ప్రచురించారు తెలంగాణ అధికారులు. ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
Telangana TextBook Controversy : తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కౌన్సిల్ రూపొందించిన పదో తరగతి సోషల్ టెక్ట్స్ బుక్స్ లో ఘోరమైన తప్పిదం జరిగింది. రాజ్యాంగ పీఠికను తప్పులతో ప్రచురించారు. అందులో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేవు. దీన్ని ఆలస్యంగా గుర్తించడంతో వివాదం ప్రారంభమయింది. దీనిపై అధికారులు తప్పు జరిగిపోయిందని అనుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో వెంటనే మార్చేశామని .. ఐదు లక్షల వరకూ సోషల్ టెక్ట్స్ బుక్స్ ముద్రించి పంపిణీ చేసినందున వెనక్కి తీసుకోలేమని వచ్చే ఏడాది తప్పు జరగకుండా చూస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మిగతా ఏ పుస్తకాల్లోనూ తప్పు దొర్లలేదని అన్నీ కరెక్ట్ గా ఉన్నాయన్నారు.
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై కొంతకాలంగా వివాదం
మామూలుగా అయితే ఇది అచ్చు తప్పు అనుకునేవారు. కానీ భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, లౌకిక పదాలను తొలగించాలని కొన్ని వర్గాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు.. వారి మద్దతు దారులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను రాజ్యాంగ పీఠికలో 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారని ఆరోపిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని పీఠికలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే భావన గణతంత్ర స్వభావాన్ని విస్తరిస్తోందని, ఇది ప్రభుత్వ సార్వభౌమ అధికారాలకు మాత్రమే పరిమితం చేయాలని, సాధారణ పౌరులకు, రాజకీయ పార్టీలకు, సామాజిక సంస్థలకు ఇది వర్తించదని కొన్ని సంఘాలు వాదిస్తున్నాయి.
ఎమర్జెన్సీ సమయంలో చేర్చారని సుప్రీంకోర్టులో పిటిషన్లు
మొదట్లో ఈ రెండు పదాలు అసలు రాజ్యాంగంలో లేవు. ఎమర్జెన్సీ విధించినప్పుడు 1977 జనవరి 3న 42 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ లో ఎలాంటీ చర్చ లేకుండా వీటిని ఆమోదించారు.
రాజ్యాంగ పరిషత్ సభ్యులు కె.టి.షా సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని మూడుసార్లు ప్రతిపాదించారు. మొదట 1948 నవంబర్ 15న లౌకిక అనే పదాన్ని చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. రెండోసారి 1948 నవంబర్ 25న మూడవసారి డిసెంబర్ 3న ప్రతిపాదించాడు. ఈ మూడు సార్లు రాజ్యాంగ పరిషత్ దీనిని తిరస్కరించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారనిచెబుతూంటారు. సోషలిజం, లౌకికవాదం ప్రభుత్వ పనితీరుకు మాత్రమే పరిమితం కావాలని కొంత మంది వాదిస్తూ ఉంటారు.
ఆన్ లైన్ లో మార్చేశామంటున్న అధికారులు
ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు లౌకికవాద సూత్రాలను అనుసరిస్తారని పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రకటించాలి. సెక్షన్ 123 ప్రకారం మతం ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించకూడదని చట్టం చెబుతోంది. ఈ క్రమంలో రాజ్యాంగ పీఠిక నుంచి ఆ రెండు పదాలను తొలగించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అవి విచారణలో పెండింగ్లో ఉన్నాయి. ఈ దశలో ఆ రెండు పదాలను తొలగించిన పీఠిన టెక్ట్స్ బుక్ లో ప్రింట్ చేయడం సహజంగానే వివాదాస్పదమయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial