తెలంగాణలో 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్, హైకమాండ్ కు జాబితా పంపిన స్క్రీనింగ్ కమిటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ, 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ, 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 49 అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి సీటు ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది. 30 నియోజకవర్గాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. మిగిలిన 40 సీట్లలో పార్టీ సర్వే, జన బలం ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 70 మంది అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ...హైకమాండ్ అందజేసింది. జాబితాను పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు... హస్తినకు క్యూకడుతున్నారు. తమకు సీటు ఇప్పించాలంటూ కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజుల పాటు సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. గురువారం భేటీలో 35 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు సమావేశమైంది. మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంతోపాటు 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది.
వడపోత జాబితాలో ఎల్‌బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వేలతోపాటు ఏఐసీసీ తరఫున చేయించిన ఇతర సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా 49 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం కమిటీ మరోమారు భేటీ కానుందని అంటున్నాయి.
మరోవైపు ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు ఏఐసీసీ, పీసీసీ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ రేవంత్‌తో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రేవంత్‌ను కలిశారు. మరోవైపు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో షర్మిల పర్యటనపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు కీలకనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చంద్రశేఖర్ వంటి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ ఢిల్లీ చేరుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్, మెదక్ అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు. ఒక సీటు మాత్రమే ఇవ్వడంతో...బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా చేశారు.