Congress Rebel Leaders: జడ్చర్ల నుంచి రెబల్ గా పోటీ చేస్తా - కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ ప్రకటన
సర్వేల ద్వారా టికెట్ కేటాయించలేదని.. కార్యకర్తల అభీష్టం మేరకు జడ్చర్ల నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎర్రశేఖర్ వెల్లడించారు.
Congress leader Yerra Shekar :
జడ్చర్ల: తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల జాబితా ప్రకటన సెగలు రేపుతోంది. తొలి జాబితాతో కొంతమంది అభ్యర్థులు పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. తమ ఆవేదనను వెల్లగక్కారు. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం నాడు 45 మందితో రెండో జాబితాను ప్రకటించిన తరువాత అసంతృప్తి మరో స్థాయికి చేరింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేయగా కొందరు నేతలు తమ మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు టికెట్ రాని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 9న జడ్చర్ల నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎర్రశేఖర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవటంతో ఎర్ర శేఖర్ శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సర్వేల ద్వారా టికెట్ కేటాయించలేదని.. కార్యకర్తల అభీష్టం మేరకు జడ్చర్ల నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ఎర్రశేఖర్ వెల్లడించారు. పార్టీకి రెబల్స్ తలనొప్పిగా మారతారని అధిష్టానం వీరిపై ఫోకస్ చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా అసంతృప్తులను శాంతింప చేసి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రయత్నించారు. ఒకానొక సమయంలో టికెట్ ఆయనకే అన్న ప్రచారం చేసుకున్నారు. జడ్చర్ల ఇవ్వకపోయినా నారాయణపేట అసెంబ్లీ సీటు వస్తుందని ఎర్ర శేఖర్ భావించారు. రెండింట్లో ఆయనకు నిరాశే ఎదురైంది. జడ్చర్ల టికెట్ ను అనిరుధ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పై రగిలిపోతున్న ఎర్ర శేఖర్, ఇవాళ పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను శనివారం సాయంత్రం ప్రకటించారు.
టీడీపీ నేత ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు. కాషాయదళంలో ఇమడలేక గత ఏడాది జులైలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీలో కీలక నేతగా ఎర్ర శేఖర్ ఉన్నారు. టీడీపీ పార్టీపై మూడు సార్లు జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్ర శేఖర్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో, శ్రీనివాస్ గౌడ్ చేతిలో గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. బీజేపీలో చేరిన ఎర్ర శేఖర్ అక్కడ సైతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. పార్టీలో ఇతర నేతలతో పొసగకపోవడం, రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ గూటికి చేరారు.
ఎర్రశేఖర్ ఎవరంటే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం సోదరుడు. జడ్జర్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఎర్ర సత్యం హత్యకు గురయ్యారు. అనంతరం ఆయన సోదరుడు ఎర్ర శేఖర్ పార్టీలో కీలకంగా మారారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు అసెంబ్లీకి వెళ్లారు. తమ్ముడి హత్య కేసుకు సంబంధించిన కేసులో నిర్దోషిగా కోర్టు తీర్పు అనంతరం ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందని భావించగా నిరాశే ఎదురైంది. జడ్చర్ల కాకపోతే మహబూబ్ నగర్ నుంచైనా తనకు అధిష్టానం ఛాన్స్ ఇస్తుందనుకున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, బరిలోకి దిగుతానని ఎర్రశేఖర్ స్పష్టం చేశారు.