Telangana Assembly Sessions: బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు.. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: పురపాలక చట్టం సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులు తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందాయి. ఆదివారం జరిగిన చర్చలో భాగంగా మొదట మంత్రి శ్రీధర్ బాబు పురపాలక చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా పురపాలక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అనంతరం మంత్రి సీతక్క పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ బిల్లులకు మద్దతు తెలుపుతుందని కేటీఆర్ అన్నారు. డిక్లరేషన్ ఇవ్వడానికి బదులుగా డెడికేషన్ తో బిల్లులను చట్టాలుగా మార్చి చూపించాలని హితవు పలికారు.
ఢిల్లీకి వచ్చి మద్దతిస్తామని ఆనాడే చెప్పాం..
మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులకు భారత రాష్ట్ర సమితి (BRS) పూర్తి మద్దతు తెలిపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ హర్షిస్తుందని చెప్పారు. శాసనసభలో మాట్లాడుతూ, ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంతో అఖిలపక్ష చర్చలు జరపాలని, అందుకోసం ప్రధానమంత్రితో సమావేశానికి సమయం కేటాయించాలని కోరారు. ‘మేము కూడా ఢిల్లీకి వచ్చి ఈ బిల్లుకు బలమైన మద్దతు ఇస్తాం’ అని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సాధించారు..
కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సాధించి వచ్చినట్లే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు. అవసరమైతే జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీకి నిజమైన కమిట్మెంట్, నిబద్ధత అవసరమని అన్నారు.
బిహార్‌లో పత్రికా ప్రకటనల ద్వారా తమ ఫొటోలు ప్రచారం చేయడం కన్నా, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కేసీఆర్ విశేషంగా కృషి చేశారని, దేశంలోనే మొదటిసారిగా ఓబీసీ వెల్ఫేర్ శాఖ ఏర్పాటు చేయాలని 2004లోనే ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, 2002లోనే బీసీల కోసం పార్టీ స్థాయిలో ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారని తెలిపారు.
కులగణన విషయంలోనూ బీఆర్ఎస్ ముందున్నదని, రాహుల్ గాంధీ కంటే ముందే తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న అంశాలను రాష్ట్రం పరిధిలోకి తీసుకొచ్చి చట్టాలు చేయడం ద్వారా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు..
‘‘రాహుల్ గాంధీ అంటున్నట్లు, ఎంతమంది ఉన్నారో ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలంటే, ఎందుకు పార్లమెంట్‌లో ఈ విషయంలో స్పష్టంగా మాట్లాడటం లేదు?’’ అని ప్రశ్నించారు. గతంలో మార్చిలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, అప్పటి పరిస్థితి ఏమిటి, ఇప్పటి పరిస్థితి ఏమిటో సమాధానం చెప్పాలని కోరారు. ‘‘బీసీ డిక్లరేషన్లు ఇస్తే సరిపోదు, దీన్ని అమలు చేసే దృఢనిశ్చయంతో ముందుకు వెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యం. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల్లో ఎక్కడా సీలింగ్ అనే అంశం లేదు,’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.






















