CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య
CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఇలా జరగడం ఇది మూడోసారి.
CM KCR: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. రోజు హెలికాప్టర్‌లో ఏదోక టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడుతోంది. కేసీఆర్ చాపర్ బయల్దేరే సమయంలో తరచూ ఏదోక టెక్నికల్ సమస్య వస్తుంది. దీంతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. బుధవారం మరోసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ మెదక్‌లో కేసీఆర్ ప్రజాఆశీర్వాద బహిరంగ సభ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయల్ధేరాల్సి ఉండగా.. హెలికాప్టర్‌లో సడెన్‌గా సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గుర్తించి పైలట్లు వెంటనే చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి కేసీఆర్ హెలికాప్టర్ బయల్దేరింది.
అయితే కేసీఆర్ హెలికాప్టర్‌లో టెక్నికల్ ప్రాబ్లం రావడం ఇది తొలిసారి కాదు. ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు మూడుసార్లు ఇలా జరిగింది. గతంలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో హెలికాప్టర్ మొరాయించింది. దీంతో సిబ్బంది రిపేర్ చేశారు. ఇప్పుడు మెదక్‌లోనూ అలాగే జరిగింది. ఇలా ప్రతీసారి జరగడం చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న కేసీఆర్.. జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తోన్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. హెలికాప్టర్ లో చకచకా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. దీపావళి పండుగ కావడంతో ఇటీవల ప్రచారానికి కేసీఆర్ కాస్త బ్రేక్ ఇచ్చారు.
ఇప్పుడు పండుగ ముగియడంతో కేసీఆర్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేంతవరకు కేసీఆర్ రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించారు. ఈ సారి బీఆర్ఎస్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగినట్లు సర్వేలన్నీ చెబుతున్నాయి. కాంగ్రెస్ ఈ సారి పుంజుకుందని, గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజల్లోనూ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయనే మౌత్ టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. గతానికి భిన్నంగా ఎన్నికల ప్రచారంలో ఎక్కువ పాల్గొంటున్నారు. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తోన్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన్లుగా మారి రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తోన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని, కరెంట్ ఉండదని ప్రచారం చేస్తోన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు రాదని చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కరే రాష్ట్రంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో వన్‌మెన్ షో నడుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలెవ్వరూ ప్రచారం చేయడం లేదు. కీలకమైన ఎన్నికల సమయంలో సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం చర్చకు దారితీస్తోంది. సీఎం సీటు కోసం పోటీ పడుతున్న నేతలు.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం లేదు.