Suryapet: హైవే నడిమధ్యలోనే తగలబడిపోయిన ఆర్టీసీ బస్సు, ఆ సమస్య వల్లే భారీ ప్రమాదం!
బస్సు డ్రైవర్ ప్రయాణికులు అందరిని వెంటనే దిగిపొమ్మని చెప్పేశాడు. అందరూ సకాలంలో కిందికి దిగడంతో ప్రాణనష్టం తప్పింది.
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల ఆర్టీసీ బస్సు మొత్తం జాతీయ రహదారి నడి మధ్యలోనే తగలబడిపోయింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఇందిరా నగర్ వద్ద తెలంగాణ ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సును ఓ బైకు కొట్టింది. అయితే, బస్సు కిందికి మోటారు సైకిల్ దూసుకెళ్లిపోయింది. దీంతో పెట్రోలు లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి బస్సుకు అంటుకుపోయి మొత్తం వ్యాపించిపోవడంతో పూర్తిగా దగ్ధం అయింది. జాతీయ రహదారి నెంబరు 65 పైన ఈ ప్రమాదం జరిగింది
ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఎండలో రోడ్డుపై బైకు కింద పడి రాపిడి జరగడం వల్ల నిప్పులు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఆ మంటలు బస్సుకు పాకాయని వెల్లడించారు.
మంటలు వ్యాపించడం చూసి అప్రమత్తం అయిన బస్సు డ్రైవర్ ప్రయాణికులు అందరిని వెంటనే దిగిపొమ్మని చెప్పేశాడు. అందరూ సకాలంలో కిందికి దిగడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కాలిపోయిన బస్సును పరీక్షించారు. అది హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోకు చెందిన రాజధాని ఏసీ బస్సు అని నిర్ధారించారు. ఆ బస్సు హైదరాబాద్ లోని మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.