Verdict on party defections petition: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పుపై ఉత్కంఠ - 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్!
Supreme Court: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పనుంది. కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది.

Supreme Court to pronounce verdict on BRS petition: పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హతా వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలో వేసిన పిటిషన్ పై గురువారం తీర్పు రానుంది. హైకోర్టులో వేసిన పిటిషన్ పై .. అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. సుప్రీం కోర్టు జూలై 31, 2025 ఉదయం 10:45 గంటలకు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (యాంటీ-డిఫెక్షన్ లా) కింద దాఖలైన అనర్హత పిటిషన్‌లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోకపోవడంపై BRS దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లకు సంబంధించినది కావడంతో తెలంగాణ రాజకీయాలలో కీలకమైన అంశంగా మారింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ 119 సీట్లలో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది, BRS నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇది యాంటీ-డిఫెక్షన్ లా (పదవ షెడ్యూల్) కింద అనర్హతకు దారితీసే అక్రమ ఫిరాయింపుగా BRS ఆరోపించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) కింద దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హతా వేటు వేయాలని పిటిషన్ వేశారు. అలాగే రిట్ పిటిషన్ కింద పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ఎం. సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీలపై అనర్హతా వేటు వేయాలని కోరారు.
ఈ ఎమ్మెల్యేలు BRS టికెట్‌పై ఎన్నికై, తర్వాత కాంగ్రెస్‌లో చేరడం ద్వారా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించారని BRS ఆరోపించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఒక ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే లేదా పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుంది. BRS పిటిషన్‌లు దాఖలు చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశారని, ఇది రాజ్యాంగ బాధ్యతల నుండి తప్పించుకోవడమని BRS వాదించింది.
నవంబర్ 2024లో, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ BRS పిటిషన్‌లను తిరస్కరించింది. అనర్హత పిటిషన్‌లపై నేరుగా తీర్పు ఇవ్వడానికి బదులు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా స్పీకర్ నుండి ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, BRS సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్‌లను నాలుగు వారాలలోపు పరిష్కరించేలా టైమ్‌లైన్ నిర్దేశించాలని సుప్రీం కోర్టును బీఆర్ఎస్ కోరింది. మార్చి 4, 2025న, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ పిటిషన్‌లపై విచారణ జరిపింది.
స్పీకర్ అనర్హత పిటిషన్‌లపై క్వాసి-జుడిషియల్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట గడువును నిర్దేశించలేదు, ఇది ఆలస్యానికి ప్రధాన కారణంగా ఉంది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మలుపులకు కారణం కానుంది.





















