Telangana Latest News: తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉత్కంఠ: మండల్ కమిషన్ కేసు, సుప్రీంకోర్టు తీర్పులే కారణమా?
Telangana : ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూనే, సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలన్నింటి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

Telangana Latest News: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ న్యాయపరమైన అడ్డంకికి ప్రధాన కారణం ఏంటి? ఈ విషయంలో ఇంత ఉత్కంఠకు కారణాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారం మేరకు ఈ రిజర్వేషన్లను ఎందుకు కల్పించలేకపోతోంది? అన్న విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ సాగిందిలా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (Backward Classes) రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 9ని జారీ చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కూడా కలిపితే, మొత్తం రిజర్వేషన్ల శాతం 67 శాతానికి పెరిగింది. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా న్యాయస్థానం ముందుకు వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. ప్రస్తుతం 23 శాతం నుంచి బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచితే, మన రాష్ట్రంలో రిజర్వేషన్లు 67 శాతానికి పెరుగుతాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడం అవుతుంది. ఈ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ని నిలుపుదల చేయాలని కొందరు న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది.
50% రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించకూడదంటున్న సుప్రీంకోర్టు తీర్పు
దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఇంద్ర సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (Indra Sawhney & Others v. Union of India)లో తీర్పు ఇచ్చింది. దీన్నే మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. ఇది దేశ రిజర్వేషన్ల చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన తీర్పుగా నిలిచింది.
ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి
1979లో నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం బీపీ మండల్ నేతృత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ (మండల్ కమిషన్)ను నియమించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఈ కమిషన్‌ను నాటి ప్రధాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై అధ్యయనం చేసిన మండల్ కమిషన్ 1980లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ నివేదిక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, 1989లో జనతాదళ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు 1990లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇంద్ర సాహ్ని, మరి కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది.
ఆ కేసులో 1992 నవంబర్ 16వ తేదీన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పును ఇచ్చింది. వెనుకబాటుతనానికి కులం ఒక ప్రాతిపదిక కావచ్చని తీర్పులో పేర్కొంది. ఇలా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూనే, సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలన్నింటి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
ఇంద్ర సాహ్నీ కేసు తీర్పు ప్రభావం
1. ఈ కేసు ద్వారా రిజర్వేషన్లపై ఉన్న చాలా అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ స్పష్టతనిచ్చింది. అందులో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవే:
2. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పరిమితి దాటవచ్చు.
3. ఓబీసీల్లో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలు (క్రీమిలేయర్) రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి మినహాయించాలి. నిజమైన వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు దక్కాలి.
4. క్రీమిలేయర్ ఓబీసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఇది వర్తించదు.
5. రిజర్వేషన్లు కేవలం తొలి నియామక దశలో మాత్రమే వర్తిస్తాయి. ఓబీసీలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.
6. ఈ తీర్పువల్ల ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు నిలిచిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 77వ రాజ్యాంగ సవరణ చేసి, ఆర్టికల్ 16(4A)ను చేర్చడం ద్వారా తిరిగి ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.
7. వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వర్గీకరించడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఈ తీర్పు కారణంగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలా రిజర్వేషన్లపై ఇంద్ర సాహ్ని వర్సెస్ భారత యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయశాస్త్రంలోనే అత్యంత కీలకమైనదిగా న్యాయ నిపుణులు భావిస్తారు.
నాటి ఇంద్ర సాహ్ని కేసు తీర్పే నేడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు ఆటంకం
ఇంద్ర సాహ్ని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు అసాధారణ పరిస్థితుల్లో తప్ప 50 శాతం మించకూడదని పరిమితిని విధించింది. ఇప్పుడు తెలంగాణలో బీసీలకు జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. ఇది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుకు అడ్డంకి అయి కూర్చుంది. దీనిపై హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.






















