తెలంగాణ పోలీసుల ముందస్తు అరెస్టులపై సుప్రీం సీరియస్
తెలంగాణలో పోలీసుల ముందస్తు అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నిర్బంధ చట్టాన్ని అనుకున్నదే తడవుగా అమలు చేస్తూ.. అరెస్టులకు దిగుతున్న పోలీసుల తీరును తప్పుపట్టింది.
తెలంగాణలో పోలీసుల ముందస్తు అరెస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నిర్బంధ చట్టాన్ని అనుకున్నదే తడవుగా అమలు చేస్తూ.. అరెస్టులకు దిగుతున్న పోలీసుల తీరును తప్పుపట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కొందరు పోలీసులు హరించడం దుర్మార్గమని అభిప్రాయపడింది. ముందస్తు నిర్బంధ చట్టాన్ని అనుకున్న వెంటనే అమలు చేస్తూ...ఇష్టమొచ్చినట్లు అరెస్టులు చేస్తున్న తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధంలో ఉన్న మహిళ భర్తను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడానికి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం...ఆ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
చట్టంలోని కఠిన నిబంధనలను ఆదరాబాదరాగా అమలు చేయవద్దని పోలీసులకు సూచించింది సుప్రీంకోర్టు. తెలంగాణ పోలీసులకు పౌరుల హక్కులను రక్షించాలనే బాధ్యత ఉందనే విషయమూ గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను మరిచిపోయి... వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పోలీసులు నిబంధనలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి చరమగీతం పాడాలని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
ముందస్తు నిర్బంధం అనేది అసాధారణ పరిస్థితుల్లో తీసుకునే చర్య అని రాజ్యాంగంలో ఉందని...అలాంటి నిబంధనను అతి సాధారణ కేసుల్లోనూ వర్తింపడజేయడం కొన్నేళ్లుగా జరుగుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు నిర్బంధంలో ప్రజల చేతులకి వేస్తున్న సంకెళ్లను తెంచడానికి రాజ్యంగంలో రక్షణలు ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్టికల్ 14.. చట్టం ముందు ఎలాంటి భేదాలు లేకుండా అందరు సమానులేనన్న ధర్మాసనం...ఆర్టికల్ 19 ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుతుందని తెలిపింది.
అధికారులు కోర్టుకు సమర్పించిన సరైన ఆధారాలను పరిశీలించాక...ముందస్తు నిర్బంధ ఆదేశాల్లోని చట్టబద్ధతను అవే నిర్ణయిస్తాయని సుప్రీకోర్టు తెలిపింది. ఈ కేసులో శాంతిభద్రత సమస్య సృష్టించే అవకాశమున్న నేరానికి.. ప్రజా జీవనం పై ప్రతికూల ప్రభావం చూపే నేరానికి మధ్య తేడాని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని స్పష్టం చేసింది. సాధారణ కేసుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న సుప్రీం...సాధారణ కేసులకు సరైన చర్యలు ఉన్నాయని.. ముందస్తు నిర్బంధం లాంటి కఠిన చర్యలు ప్రయోగించడం అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.