BRS News : మహిళా కమిషన్ చైర్మన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా - కారణం ఏమిటంటే ?
మహిళా కమిషన్ చైర్మన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్నందునే పదవికి రాజీనామాచేశారు.
BRS News : తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజ్యాంగపరమైన పదవి నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్‌లో బుధవారం బీ-ఫారం అందుకున్న కొన్ని గంటల తర్వాత ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. రెండున్నరేళ్ళకు పైగా ఆమె కమిషన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. దీర్ఘకాలం పాటు కమిషన్ ఖాళీగా ఉండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబరు 27న కమిషన్ ఏర్పాటైంది. చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో పోటీ కోసం వైదొలిగారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ టిక్కెట్ కేటాయిపంు
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కాదని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికే ఖరారు చేశారు కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సీఎం కేసీఆర్ మెదక్ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బిఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని కేసీఆర్ అన్నారు. 35 ఏండ్ల నుంచి సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా తనకు అత్యంత ఆప్తుడని.. కుడి భుజం లాంటి వాడన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుందన్నారు.
మెదక్ ఎంపీగా మదన్ రెడ్డి
ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్ రెడ్డి పాపులర్ లీడర్ అని కేసీఆర్ అన్నారు. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకివచ్చారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో.. కాంగ్రెస్ లోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందు మూడు సార్లు నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి విజయం సాధించారు. ఆమె బీఆర్ఎస్‌లో చేరడంతో ఆమెకే టిక్కెట్ ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు.