Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత
Telangana News: ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్డన్ సెర్చ్ అంటూ అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Stone Pelting On Forest Personnels In Adilabad: ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇచ్చోడ మండలం కేశవపట్నంలో (Keshavapatnam) ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున అటవీ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. పలు ఇళ్లల్లో కలప దుంగలు, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇళ్లల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వారిపై రాళ్లు రువ్వడంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలు కాగా.. అటవీ శాఖకు చెందిన ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను నిలువరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అయితే, దాడి విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
20 మందిపై కేసు
ఈ ఘటనకు సంబంధించి 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో సోదాలు చేయగా.. పలు ఇళ్లల్లో భారీగా కలప స్వాధీనం చేసుకున్నామని.. దీంతో గ్రామస్థులు రాళ్ల దాడికి తెగబడ్డారని అటవీ అధికారులు తెలిపారు. రాళ్ల వర్షం కురుస్తుంటే బతికి బయటకు వస్తామో రామో అని అనుమానం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఐదుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడగా, రెండు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. గాయపడిన వారిలో భూమన్న FSO, నౌశిలాల్ FBO, అనిల్ FBO, పాండురంగ్ వాచర్, ముకుంద్ డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో సుమారుగా రూ.3.50 లక్షల విలువైన కలప పట్టుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని.. వనాలను సంరక్షించాలని, వనాలు ఉంటేనే అందరూ సంరక్షంగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. అటు, పోలీసులు త్వరలోనే దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు.